IPL 2025: పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ ట్రోఫీ ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో రికీ పాంటింగ్

ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. 2014లో ఫైనల్‌కు చేరినా, విజేతగా నిలవలేకపోయింది. తరచుగా పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లోనే ఉంటూ వచ్చిన పంజాబ్.. ఈసారి గట్టిగా పట్టుదలతో ఉంది.

కొత్త హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రికీ పాంటింగ్ పంజాబ్ కింగ్స్ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. జట్టు కూర్పు నుంచి వ్యూహరచన వరకు అన్నింటిలో మార్పులు తీసుకువచ్చే పనిలో పాంటింగ్ నిమగ్నమయ్యాడు.

ప్రత్యేక పూజలు నిర్వహించిన పాంటింగ్

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే పంజాబ్ కింగ్స్ టీమ్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. ట్రోఫీ గెలుపు లక్ష్యంగా ఆటగాళ్లతో పాటు కోచ్ రికీ పాంటింగ్ కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనిపై నెటిజన్లు “కప్పు కొట్టే వరకు పాంటింగ్ వదిలేలా లేడుగా” అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పాంటింగ్ పట్టుదలకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మద్దతుగా నిలిస్తే పంజాబ్ తొలి ట్రోఫీ గెలవడంలో ఆశ్చర్యం లేదని అభిప్రాయపడుతున్నారు.

పంజాబ్ జట్టులో సమూల మార్పులు

7 ఏళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌కు కోచ్‌గా ఉన్న పాంటింగ్, ఆ జట్టుకు ట్రోఫీ అందించలేకపోయాడు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్‌కు మారిన పాంటింగ్ 2028 వరకు హెడ్ కోచ్‌గా కొనసాగనున్నాడు.

ఈసారి ఐపీఎల్ ట్రోఫీ సాధించాలన్న సంకల్పంతో పాంటింగ్ జట్టులో సమూల మార్పులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ (₹26.75 కోట్లు), అర్ష్‌దీప్ సింగ్ (₹18 కోట్లు – ఆర్టీఎం), యుజ్వేంద్ర చాహల్ (₹18 కోట్లు) వంటి ఆటగాళ్లను తీసుకోవడంతో జట్టు మరింత పటిష్టమైంది.

అంతేకాకుండా గ్లెన్ మాక్స్‌వెల్, మార్కో జాన్సన్, మార్కస్ స్టొయినిస్ వంటి విదేశీ ఆల్‌రౌండర్లను జట్టులోకి తీసుకున్నాడు. ఆసీస్ తరహాలో ట్రెయినింగ్ ఇప్పిస్తూ తన ప్రత్యేక శైలిని జట్టుపై పాంటింగ్ చూపిస్తున్నాడు.

“ప్రాజెక్ట్ పంజాబ్” పేరుతో ఐపీఎల్ ట్రోఫీ గెలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న పాంటింగ్ కల నిజమవుతుందా? అనేది ఆసక్తిగా మారింది.

Read More

One thought on “IPL 2025: పంజాబ్ కింగ్స్‌కు ఐపీఎల్ ట్రోఫీ ఎగరేసుకుపోవాలనే పట్టుదలతో రికీ పాంటింగ్

Comments are closed.