శాంతికి సిద్ధమని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన.

భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో, పాకిస్థాన్ నుంచి ఒక కీలక ప్రకటన వెలువడింది. భారత్ తాము చేపట్టిన సైనిక చర్యలను నిలిపితే, ఉద్రిక్తతలను తగ్గించేందుకు తాము కూడా తగిన చర్యలు తీసుకుంటామని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్ స్పష్టం చేశారు.

“మా సహనం నశించిన తర్వాతే స్పందించాం. భారత్ ఆగితే, మేమూ ఆగిపోతాం అనే అంశాన్ని పరిశీలిస్తాం,” అని ఆయన జియో న్యూస్‌ చానల్‌తో మాట్లాడుతూ చెప్పారు. భారత్ మరోసారి దాడులకు దిగితే, తమ ప్రతిస్పందన మరింత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో కూడా పంచుకున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ అధికారులతో జరిగిన చర్చల అనంతరం రూబియో తనను సంప్రదించారని వెల్లడించారు.

ఇకపోతే, దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం, పౌరుల దినచర్యలపై ప్రభావం చూపుతోన్న పరిస్థితుల్లో, యుద్ధ వాతావరణం మరింత సమస్యలు తలెత్తించవచ్చన్న ఆందోళనలు పాకిస్థాన్‌లో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారతితో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, శాంతియుత పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నామని పాక్ అధికార వర్గాలు వెల్లడించాయి.

అమెరికా కూడా ఈ పరిణామాలను గమనిస్తూ, ఇరు దేశాలు సంయమనం పాటించి ఉద్రిక్తతలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఇషాక్ దార్ చేసిన తాజా ప్రకటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

అయితే, శాంతికి పిలుపునిస్తున్న పాకిస్థాన్ మరోవైపు కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది. గురువారం రాత్రి నుంచి భారత్ సరిహద్దుల్లో పలు ప్రాంతాల్లో డ్రోన్ దాడులకు పాల్పడింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం, అవంతీపురా ఎయిర్ బేస్‌ లక్ష్యంగా డ్రోన్లను ప్రయోగించినా, భారత భద్రతా బలగాలు సమర్థవంతంగా ఆ ప్రయత్నాలను తిప్పికొట్టాయి.

శనివారం కూడా జమ్ము, ఫిరోజ్‌పుర్, పఠాన్‌కోట్, జైసల్మేర్, బాడ్‌మేడ్, భుజ్ వంటి కీలక ప్రాంతాల్లో డ్రోన్లతో దాడి చేయాలని పాక్ ప్రయత్నించగా, అప్రమత్తంగా ఉన్న భారత సైనికులు వాటిని భద్రంగా నిర్వీర్యం చేశారు.

సరిహద్దు వద్ద ఈ విధంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య దౌత్య చర్చలు, అంతర్జాతీయ సమాజం స్పందన కీలకం కానుంది.

Read More : మదర్సా విద్యార్థుల వినియోగంపై విమర్శలు

One thought on “శాంతికి సిద్ధమని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ప్రకటన.

Comments are closed.