భారత్‌ మలేరియా నిర్మూలన దిశగా కీలక పురోగతి

మలేరియా వ్యాధి నిర్మూలనలో భారత్‌ మరో ముందడుగు వేసింది. దేశీయంగా తయారు చేస్తున్న కొత్త మలేరియా వ్యాక్సిన్‌ ‘అడ్‌ఫాల్సివాక్స్‌’ ప్రీ-క్లినికల్ దశలో అద్భుత ఫలితాలు నమోదు చేసింది. ఈ వ్యాక్సిన్‌ను భారత వైద్య పరిశోధన మండలి (ICMR), భువనేశ్వర్‌లోని రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ (RMRCBB), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (NIMR) మరియు బయోటెక్నాలజీ శాఖకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ (DBT-NII) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ప్లాస్మోడియం ఫాల్సిపారమ్ అనే ప్రమాదకర పరాన్నజీవి జీవనచక్రంలోని రెండు కీలక దశలను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాక్సిన్‌ రూపొందించారు. ఇది వ్యాధిని గణనీయంగా తగ్గించడమే కాకుండా, ప్లాస్మోడియం మళ్లీ ప్రబలకుండా నిరోధించగల సామర్థ్యం కలిగి ఉంది.

లాక్టోకాకస్ లాక్టిస్ అనే బ్యాక్టీరియాను ఉపయోగించి తయారు చేసిన ఈ వ్యాక్సిన్‌ గది ఉష్ణోగ్రతలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉండగలదు. దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని కలిగించగల ఈ వ్యాక్సిన్‌ సాధారణ టీకాలతో పోలిస్తే విస్తృత రక్షణను అందించగలదని పరిశోధనలో వెల్లడైంది.

ప్రస్తుతం ఇది వాణిజ్యరంగానికి అందుబాటులో లేకపోయినా, పరిశ్రమలకు నాన్-ఎక్స్‌క్లూజివ్ లైసెన్సింగ్ ద్వారా అందజేయాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ప్రజారోగ్యం కోసం ఇది ఒక సాంకేతిక విజయంగా పేర్కొంటున్నారు.

‘మేక్ ఇన్ ఇండియా’ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే ఈ స్వదేశీ వ్యాక్సిన్‌ ద్వారా భారత్‌ మలేరియా నిర్మూలనలో కీలక మైలురాయిని చేరుకోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More : రోజుకు ఎన్ని నిమిషాలు నడవాలో తాజా అధ్యయనంలో వెల్లడి