భారత వైమానిక దళం (IAF) పాకిస్థాన్‌తో సరిహద్దు వెంబడి నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో పూర్తి కార్యాచరణ సంసిద్ధతతో ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందని వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నివేదించారు. ప్రధాని మోదీతో ఢిల్లీలో నిర్వహించిన అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశంలో, సరిహద్దుల్లో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలపై ఆయన సమగ్ర నివేదిక అందించారు.
ఇటీవల నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి కూడా నౌకాదళ కార్యకలాపాలపై ప్రధానికి వివరించగా, వెంటనే వాయుసేన భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాక్ తరచూ కాల్పుల విరమణ ఉల్లంఘిస్తుండడంతో భారత సైన్యం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో, పాకిస్థాన్ నుంచి ఎలాంటి దుస్సాహసమైనా జరిగితే వెంటనే దీటుగా స్పందించేందుకు వాయుసేన సిద్ధంగా ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి.
వాయుసేన అప్రమత్తత – నిఘా, రెడీనెస్
పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ విమానాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నాయి. సుదూర ప్రాంతాల్లోనూ నిఘా కొనసాగుతోందని ఎయిర్ చీఫ్ వెల్లడించారు. అన్ని కీలక వైమానిక స్థావరాల్లో డిఫెన్స్ వ్యవస్థలు పటిష్ఠంగా అమర్చబడ్డాయని తెలిపారు. ఆపరేషనల్ రెడీనెస్ ప్లాట్‌ఫామ్స్ కింద పూర్తి ఆయుధ సామగ్రితో సిద్ధంగా ఉన్న యుద్ధ విమానాలు, కొన్ని నిమిషాల్లోనే గాల్లోకి లేచి దాడికి సిద్ధంగా ఉంటాయని వివరించారు.
రఫేల్ యుద్ధ విమానాలతో పెరిగిన పటిమ
ప్రస్తుతం భారత వాయుసేనకు రఫేల్ యుద్ధ విమానాలు భారీ బలం చేకూర్చాయి. 4.5 జనరేషన్‌కు చెందిన ఈ యుద్ధ విమానాలు 300 కిలోమీటర్ల దూరంలోని భూ లక్ష్యాలను ఛేదించగల ‘స్కాల్ప్’ క్రూయిజ్ క్షిపణులతో, అలాగే 150 కిలోమీటర్ల లోపల శత్రు విమానాలను ఖచ్చితంగా కూల్చగల ‘మీటియోర్’ ఎయిర్-టు-ఎయిర్ క్షిపణులతో సమర్పింపబడ్డాయి. వేగవంతమైన, సమర్థవంతమైన దాడుల సామర్థ్యం కారణంగా ఈ విమానాలు గేమ్‌చేంజర్‌గా మారనున్నాయని రక్షణ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
భారత ప్రభుత్వం ఈ పరిస్థితులను దగ్గర నుంచి గమనిస్తూ, తగిన చర్యలు తీసుకుంటోందని విశ్వసనీయ వర్గాలు స్పష్టం చేశాయి.
Read More : భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ రెండో క్షిపణి పరీక్ష..

One thought on “భారత వైమానిక దళం పూర్తిస్థాయిలో సిద్ధం”
Comments are closed.