హైద‌రాబాద్‌లో గర్భవతిపై భ‌ర్త దారుణ‌దాడి..

హైదరాబాద్ గచ్చిబౌలిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణం చోటుచేసుకుంది. గర్భవతైన భార్యపై భర్త సిమెంట్ ఇటుకతో విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రాణాపాయస్థితిలో నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

వివరాల్లోకి వెళితే…
హఫీజ్‌పేట ఆదిత్యనగర్‌కు చెందిన మహ్మద్ బస్‌రత్ (32) – 2023లో అజ్‌మేర్ దర్గాకు ప్రయాణించగా, బస్సులో బెంగాల్‌కి చెందిన షబానా పర్వీన్ (22)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, గతేడాది అక్టోబర్‌లో కోల్‌కతాలో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. అనంతరం పర్వీన్‌ను హఫీజ్‌పేటకు తీసుకొచ్చిన బస్‌రత్‌తో విభేదాలు తలెత్తడంతో ఆమె వేరుగా ఉండసాగింది.

ఇటీవల గర్భం దాల్చిన పర్వీన్ అనారోగ్యంతో మార్చి 29న ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. ఆరోగ్యం మెరుగుపడటంతో ఏప్రిల్ 1న రాత్రి డిశ్చార్జ్ అయ్యింది. ఇంటికి తిరిగివస్తున్న సమయంలో బస్సు ప్రయాణంలో ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ తీవ్రంగా మారి, బస్‌రత్‌ ఆమెను కొట్టి కింద పడేసాడు. అనంతరం పక్కనే ఉన్న సిమెంట్ ఇటుకతో ఆమె తలపై పలు మార్లు దాడి చేశాడు. స్పృహ కోల్పోయిన పర్వీన్‌ను చనిపోయిందని అనుకుని బస్‌రత్ ఘటన స్థలంనుంచి పరారయ్యాడు.

వార్త అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన పర్వీన్‌ను నిమ్స్‌కు తరలించారు. తల గాయంతో ఆమె కోమాలోకి వెళ్లిందని, ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. నిందితుడు బస్‌రత్‌ను ఏప్రిల్ 3న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Read More : సిగరెట్ నిర్లక్ష్యంతో నిద్రలోనే మంటల్లో కాలిపోయిన ఘటన..