గుండె బలహీనత సంకేతాలు

గుండె సంబంధిత సమస్యలపై మాట్లాడితే చాలామందికి మొదట గుర్తుకు వచ్చేది ఛాతినొప్పే. కానీ వైద్య నిపుణుల ప్రకారం, గుండె బలహీనతను సూచించే మరెన్నో లక్షణాలు కూడా ఉన్నాయి. వీటిని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం తప్పదని వారు హెచ్చరిస్తున్నారు.

శ్వాస సమస్యలు ప్రధాన సంకేతం:
గుండెకు రక్తప్రసరణ తగ్గినప్పుడు ఊపిరితిత్తుల్లో నీరు పేరుకుపోవడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. ఈ సమస్య గుండె బలహీనతకు మొదటి సంకేతంగా భావించాలి.

నీరసం, శక్తి తగ్గుదల:
తగినంత విశ్రాంతి తీసుకున్నా కూడా నీరసం తగ్గకపోవడం, మెట్లు ఎక్కడం లేదా బరువైన వస్తువులు మోసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడం గుండె సరిగా పనిచేయకపోవడమే కారణమని వైద్యులు చెబుతున్నారు.

కాళ్లలో వాపు (ఎడిమా):
గుండె బలహీనపడినప్పుడు రక్తాన్ని సక్రమంగా పంప్ చేయలేక శరీరంలోని కాళ్లు, మడమల్లో ద్రవం పేరుకుపోతుంది. దీన్ని ఎడిమా అంటారు. దీని వల్ల కాళ్లు బరువుగా అనిపించడం, వాపు రావడం జరుగుతుంది.

గుండె చలనంలో మార్పులు:
గుండె దడలో అసాధారణ మార్పులు (ఎరిథ్మియా), దడ వేగం ఎక్కువ కావడం కూడా గుండె బలహీనతను సూచిస్తాయి.

తలతిరగటం, స్పృహ తప్పడం:
గుండె బలహీనపడినప్పుడు మెదడుకు రక్త సరఫరా తగ్గుతుంది. దీని వల్ల తల తిరగటం, స్పృహ తప్పడం, నిత్యం మత్తుగా ఉండటం వంటి సమస్యలు వస్తాయి.

నిపుణుల హెచ్చరిక:
ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమయానుసారంగా పరీక్షలు చేయించుకోవడం అవసరమని వారు చెప్పారు.