ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశం

ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యే అవకాశముంది. 1992 బ్యాచ్కు చెందిన ఆయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 31న ప్రస్తుత డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో, హరీష్ గుప్తాను డీజీపీగా నియమించనున్నట్లు సమాచారం. తిరుమలరావు ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పదవీవిరమణ తరువాత ఆయన్ని ఆ పోస్టులో కొనసాగించే అవకాశం ఉంది.

సార్వత్రిక ఎన్నికల సమయంలో హరీష్ గుప్తాను ఎన్నికల సంఘం డీజీపీగా నియమించి కొన్నిరోజుల పాటు ఆ బాధ్యతలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చాక, తిరుమలరావును డీజీపీగా నియమించారు. ఆయన పదవీవిరమణ తరువాత సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్కు చెందిన అగ్నిమాపకశాఖ డైరెక్టర్ జనరల్ మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో ఉంటారు. హరీష్ గుప్తా రెండో స్థానంలో ఉన్నారు.