హమాస్ నుంచి 4 మహిళా బందీలు విడుదల, ఇజ్రాయెల్ కు ప్రతిగా 100 పాలస్తీనియన్లు

గాజా కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం, శనివారం హమాస్ నలుగురు మహిళా బందీలను విడుదల చేసింది. ఆ నలుగురి పేర్లు కరీనా ఆరీవ్, డానియెల్ గిల్బావా, నామా లెవి, లిరి అల్బాజ్. వీరికి ప్రతిగా 100 కి పైగా పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టనుంది. ప్రస్తుతం విడుదలైన వారు మహిళా సైనికులు. గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ నుంచి వీరిని 2023 అక్టోబర్ 7న హమాస్ బంధించి తీసుకెళ్లింది. 477 రోజుల పాటు వారు హమాస్ చేతిలో బందీగా ఉన్నారు. తాజాగా వారిని మిలిటరీ యూనిఫాంలో తీసుకొచ్చి రెడ్ క్రాస్ కు అప్పగించిన తరువాత, వారిని ఇజ్రాయెల్ కు తీసుకెళ్లే వాహనం గాజాను వీడింది.

కాల్పుల విరమణ ప్రారంభమైన తొలి రోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్ విడుదల చేయగా, వందకు పైగా పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. 42 రోజుల కాల్పుల విరమణ ఒప్పందంలో, తమ చెరలో ఉన్న 94 మంది బందీల్లో 33 మందికి హమాస్ స్వేచ్ఛ కల్పించనుంది. ప్రతిగా దాదాపు 1700 మందికి పైగా పాలస్తీనియులు తమ జైళ్ల నుంచి ఇజ్రాయెల్ విడుదల చేయనుంది.