భారీ పెట్టుబడుల మోసానికి పాల్పడిన ఫాల్కన్ చైర్మన్ అమర్‌దీప్ కుమార్‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కు అప్పగించారు. అమర్‌దీప్ కుమార్ రూ.1700 కోట్ల మేర ప్రజల నుంచి వసూలు చేసినట్లు గుర్తించారు. చిన్న మొత్తాలను పెట్టుబడిగా స్వీకరించి అధిక లాభాలంటూ మోసాలకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు.
కేసు నమోదైన వెంటనే అమర్‌దీప్ కుమార్ దేశం విడిచి దుబాయ్‌కు పారిపోయినట్లు సమాచారం. దీంతో పోలీసులు అతని సహా ఫాల్కన్ కంపెనీ ఎండీ, సీఈవో, సీఓలపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్‌పోర్టుల్లో అధికారులను అప్రమత్తం చేశారు.
సైబరాబాద్ పోలీసులు ఫాల్కన్ స్కీమ్‌లో స్కాం జరిగినట్లు గుర్తించి ఈఓడబ్ల్యూ (EOW) ద్వారా దర్యాప్తు చేపట్టారు. రూ.1700 కోట్ల పెట్టుబడులను విదేశీ ఖాతాల్లో జమ చేసారా లేక ఇతర మార్గాల్లో దాచిపెట్టారా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును ఈడీకి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈవోడబ్ల్యూ (EOW) అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్, బాధితుల ఫిర్యాదులను పరిశీలించి, విచారణలో బయటపడ్డ కీలక అంశాలను ఈడీ అధికారులకు అందజేయనున్నారు.
ప్రధాన నిందితుడు అమర్‌దీప్ కుమార్ ఇప్పటికే దుబాయ్‌కు పారిపోయినట్లు ధృవీకరించిన ఈవోడబ్ల్యూ అధికారులు, అతని సహచరులపై లుకౌట్ నోటీసులు జారీ చేసి, త్వరలో మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
