కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో మరో కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ శుక్రవారం విచారించింది. ఈ సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ, ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు వద్దే ఉండేదని స్పష్టం చేశారు.
“ఈ ప్రాజెక్టులో ఆర్థిక శాఖ పాత్ర చాలా పరిమితం, మరియు ఏవైనా ఆర్థిక నిర్ణయాలు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో తీసుకోబడ్డాయి” అని ఈటల రాజేందర్ అన్నారు. “కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నా పాత్ర శూన్యం. ఏ రీతినైనా నిజాయితీగా సమాధానం ఇచ్చా,” అని చెప్పారు.
కమిషన్ తనను ప్రాజెక్టు ఖర్చులు, కార్పొరేషన్ రుణాలపై ప్రశ్నించిందని, అయితే ఆర్థిక శాఖకు వాటితో సంబంధం లేదని తాను స్పష్టం చేసినట్లు తెలిపారు. ప్రాజెక్టు వ్యయంపై మాట్లాడుతూ, తొలుత రూ.63 వేల కోట్లతో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు, అనంతరం వివిధ కారణాలతో రూ.82 వేల కోట్లకు చేరిందని వివరించారు.
“కేబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటు చేసి, దానికి హరీశ్ రావును చైర్మన్‌గా నియమించిన సంగతి గుర్తు ఉంది. మేడిగడ్డ వద్ద నిర్మించిన ఆనకట్ట సాంకేతిక నిపుణుల సలహాల మేరకే చేపట్టారు. రాజకీయ నాయకులకు ఇలాంటి నిర్మాణాలపై అంతగా అవగాహన ఉండదు” అని వ్యాఖ్యానించారు.
తన మీద ఎలాంటి ఒత్తిడి వచ్చినా నిజం చెప్పడానికే తాను సిద్ధమని స్పష్టంగా చెప్పిన ఈటల రాజేందర్, “నా కణతపై తుపాకీ పెట్టినా సరే, నిజమే మాట్లాడతా” అని అన్నారు. ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వివరాలు ప్రజల ముందుంచాలని సూచించిన ఆయన, ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని హితవు పలికారు. అలాగే, ప్రజాధనాన్ని వృథా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
“ఈ ప్రాజెక్టును తన మానస పుత్రికగా కేసీఆర్ అనేకసార్లు ప్రకటించారు. నేను ఎప్పుడూ నైతిక విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తిని. ఏ పదవిలో ఉన్నా, నిజాయితీతోనే వ్యవహరించాను” అని ఈటల రాజేందర్ అన్నారు.
Read More : తెలంగాణ సీఎం : రాష్ట్ర రాజకీయాలపై కీలక చర్చలు.

One thought on “రాజేందర్ కీలక వ్యాఖ్యలు: నిజం మాత్రమే మాట్లాడతా”
Comments are closed.