దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మళ్లీ స్వల్పంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. మే 19 నాటికి భారత్‌లో మొత్తం 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ చర్యలు ముమ్మరం చేసింది. కరోనా వ్యాప్తిని పర్యవేక్షిస్తూ, వేరియంట్ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తోంది.
ప్రస్తుతం కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఇదే సమయంలో హాంకాంగ్, సింగపూర్ వంటి దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో భారత ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. అక్కడ వ్యాప్తి చెందుతున్న ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8 వేరియంట్లు భారత్‌లోనూ రావచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు వేరియంట్లు జేఎన్.1 వేరియంట్ నుంచి ఉద్భవించినవే కావడం గమనార్హం.
జేఎన్.1 వేరియంట్ వివరాలు
జేఎన్.1 వేరియంట్ ఒమిక్రాన్ బీఏ.2.86 నుంచి ఉద్భవించింది. 2023 ఆగస్టులో తొలిసారిగా గుర్తించబడి, తక్కువ సమయంలో ఎక్కువ మందిలో వ్యాపించగల సామర్థ్యం కలిగి ఉంది. ఇది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని ఛేదించి ఇన్‌ఫెక్షన్ కలిగించగలదని యేల్ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు.
జేఎన్.1 లక్షణాలు
ఈ వేరియంట్ బారిన పడిన వారిలో పొడి దగ్గు, రుచి కోల్పోవడం, తలనొప్పి, ముక్కు దిబ్బడ, తీవ్ర అలసట, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందిలో డయేరియా కూడా కనిపిస్తోంది.
ప్రభుత్వ చర్యలు
దేశంలో పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోనే ఉందని ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. నిన్న జరిగిన అత్యవసర సమీక్షా సమావేశంలో డీజీహెచ్ఎస్ నేతృత్వంలో తాజా పరిస్థితిపై చర్చ జరిగింది. కేసులు ఉన్నప్పటికీ అవి తీవ్రమైనవిగా లేవని, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు.
అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచడం, సామాజిక దూరం పాటించడం వంటి కొవిడ్ ప్రాథమిక నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ తరహా కొత్త వేరియంట్లను అరికట్టేందుకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Read More : రాత్రిపూట ఫోన్‌ను దిండు పక్కన పెట్టి నిద్రపోతున్నారా?
One thought on “ఇండియాలో మళ్లీ కరోనా కేసుల పెరుగుదల”
Comments are closed.