జమ్ముకశ్మీర్‌లో రవాణా సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా చేపట్టిన కట్రా-కాజీగుండ్ రైల్వే ప్రాజెక్టు మరో కీలక దశకు చేరుకుంది. ఈ మార్గంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చీనాబ్ వంతెనపై ప్రత్యేక రైలు విజయవంతంగా ప్రయోగాత్మక ప్రయాణం పూర్తి చేసింది.
ఈ రైలు ప్రయాణం జమ్ముకశ్మీర్‌ను మిగిలిన భారతదేశంతో రైల్వే మార్గం ద్వారా మరింత బలంగా అనుసంధానించనున్నదని అధికారులు తెలిపారు. పర్వత ప్రాంతాల్లో రవాణా వేగం పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ రైల్వే ప్రాజెక్టు అత్యంత వ్యూహాత్మకంగా మారింది. ఇటీవల సరిహద్దుల్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ, ఈ వంతెనపై రైలు ప్రయాణం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉత్తర రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షూ శేఖర్ ఉపాధ్యాయ్ ఈ ప్రయోగాత్మక ప్రయాణాన్ని ధృవీకరించారు. ఉదయం 10 గంటలకు కట్రా నుంచి బయలుదేరిన ప్రత్యేక రైలు సాయంత్రం 6 గంటలకు తిరిగి స్టేషన్‌కు చేరుకుంది. ఈ ప్రయాణంలో సెలవులు ముగించుకుని విధుల్లో చేరుతున్న సైనికులు కూడా పాల్గొన్నారు.
గత నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మార్గాన్ని ప్రారంభించాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ కారణంగా పర్యటన వాయిదా పడింది. ప్రస్తుతం కట్రా నుంచి కాజీగుండ్ వరకు మాత్రమే రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా బారాముల్లా నుంచి కాజీగుండ్ వరకు మాత్రమే రైళ్లు నడుస్తుంటాయి.
జమ్ముకశ్మీర్‌కు పౌర విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోవడంతో, ఈ రైలు మార్గం సైనికులకు, ప్రయాణికులకు ప్రత్యామ్నాయ మార్గంగా ఉపయోగపడుతోంది.
Read More : జాతీయ మహిళా కమిషన్ మండిపాటు

One thought on “జాతీయ అనుసంధానానికి కీలక అడుగు”
Comments are closed.