బ్రోంకో టెస్ట్ వివాదం.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై ప్రశ్నలు

భారత క్రికెట్‌లో మరోసారి ఫిట్‌నెస్ పరీక్షలపై చర్చ మొదలైంది. జట్టులో కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ‘బ్రోంకో టెస్ట్’ వివాదానికి దారితీసింది. ఈ పరీక్ష వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ క్రికెటర్, ప్రస్తుత రాజకీయ నాయకుడు మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మను 2027 ప్రపంచకప్ ప్రణాళికల నుంచి తప్పించేందుకే దీన్ని తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు. బ్రోంకో టెస్ట్‌ను ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ను మరింత ఉన్నత స్థాయిలో ఉంచేందుకు, ప్రత్యేకించి పేసర్లకు మేలు కలిగేలా జట్టు స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ అడ్రియన్ లే రౌక్స్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ నిర్ణయానికి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో కొన్ని ఫిట్‌నెస్ సమస్యలు తలెత్తడంతో బీసీసీఐ ఈ పరీక్షను అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఆటగాళ్లు 20, 40, 60 మీటర్ల దూరం వేగంగా పలుమార్లు పరుగెత్తాలి.

అయితే, ఈ పరీక్ష వెనుక ఉన్న ఉద్దేశ్యంపై మనోజ్ తివారీ అనుమానాలు వ్యక్తం చేశారు. “విరాట్ కోహ్లీని పక్కన పెట్టడం సాధ్యం కాదు, కానీ రోహిత్ శర్మను జట్టులో నుంచి తప్పించేందుకు ఇది ఒక ప్రయత్నం కావచ్చని అనిపిస్తోంది. కొత్త కోచ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే దీన్ని ఎందుకు అమలు చేయలేదు? ఇప్పుడు ఎందుకు తెరపైకి తెచ్చారు? అనే ప్రశ్నలకు సమాధానం లేదు” అని తివారీ వ్యాఖ్యానించారు.

తివారీ అభిప్రాయం ప్రకారం, రోహిత్ తన ఫిట్‌నెస్‌పై మరింత కృషి చేయకపోతే బ్రోంకో టెస్ట్ అతని భవిష్యత్తుకు పెద్ద అడ్డంకిగా మారవచ్చని భావిస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఇద్దరూ 2027 ప్రపంచకప్ ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ పరీక్ష రోహిత్ క్రికెట్ కెరీర్‌ను ప్రశ్నార్థకంగా మార్చవచ్చనే అభిప్రాయాలు క్రీడా వర్గాల్లో వినిపిస్తున్నాయి.

Read More : ఆసియా కప్‌కు ముందు తిరుమల శ్రీవారి దర్శనంలో క్రికెటర్ తిలక్ వర్మ

One thought on “బ్రోంకో టెస్ట్ వివాదం.. రోహిత్ శర్మ భవిష్యత్తుపై ప్రశ్నలు

Comments are closed.