తెలంగాణ ఆర్టీసీలో అద్దె బస్సులు నడుపుతున్న 151 మండల మహిళా సంఘాల గ్రూప్‌లకు రూ.1.05 కోట్లు విలువైన చెక్కులను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క అందజేశారు. అనంతరం మహిళా రచయితలు, కవులు రచించిన “మహాలక్ష్మి – మహిళా సాధికారతలో ప్రగతి చక్రాలు” పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, గత ప్రభుత్వం మహిళా సమాఖ్యలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలు ప్రారంభించామని, త్వరలో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పారు. “అవకాశాలు ఉన్న ప్రతీ చోట మహిళా సమాఖ్యలకు వ్యాపారాల కోసం సహాయం చేస్తాం. లక్ష్యం – కోటి మంది మహిళలను కోటీశ్వరీమణులుగా తీర్చిదిద్దడం” అని భట్టి విక్రమార్క స్పష్టంచేశారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు గ్రామ స్థాయిలో కూడా తెలిసేలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.
ఈ నెల 10 నుంచి 16 వరకు రాష్ట్రవ్యాప్తంగా వడ్డీలేని రుణాల చెక్కుల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రభుత్వం ప్రజలది అని పేర్కొన్న ఆయన, కుటుంబ పెద్దల ఆర్థిక శక్తి పెరిగితే రాష్ట్ర అభివృద్ధి వేగంగా జరుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణను మహిళా సాధికారతలో దేశానికి ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తామని చెప్పారు.
Read More : గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో హాజరైన కొడాలి నాని

One thought on “మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం భట్టి”
Comments are closed.