ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

ఫోన్ ట్యాపింగ్ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కుటుంబాల జీవితాలతో ఆడుకుందని ఆరోపించిన ఆయన, ఈ వ్యవహారంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. కరీంనగర్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమం అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.
ఫోన్ ట్యాపింగ్ ప్రధానంగా హైదరాబాద్, సిరిసిల్ల ప్రాంతాలను కేంద్రంగా జరగిందని, దీనికి వెనుక ఉన్నవారు ఇప్పుడు ప్రజలకు స్పష్టంగా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ఎలాగైనా దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ, ప్రస్తుతం జరుగుతున్న సిట్ దర్యాప్తు తూతూమంత్రంగా సాగుతోందని విమర్శించారు.
ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. వారు అనేక కుటుంబాలను నాశనం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోయారని చెప్పారు. సుప్రీం కోర్టు నుండి ఊరట వచ్చిన తర్వాత ఆయనకు రాచమర్యాదలు చేస్తున్నారని మండిపడ్డారు.
“పెద్దాయన చెప్పడంతోనే ఫోన్ ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు వాంగ్మూలం ఇచ్చాడు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారించాలి. సిరిసిల్లలో జరిగిన ఈ వ్యవహారంలో కేటీఆర్ పాత్రను కూడా నిర్దిష్టంగా విచారించాలి,” అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని ఆయన కోరుతూ, ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రానికి నేరుగా సీబీఐ దర్యాప్తు చేపట్టే అధికారం ఉన్నందున, ఇప్పటికే దోషులను శిక్షించాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

Read More : బనకచర్లపై ఏపీతో చర్చలకు సిద్ధం: సీఎం

One thought on “ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్‌పై బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు

Comments are closed.