ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం కలుగుతుందని, ఆ ప్రాజెక్టును ఏ విధంగానైనా అడ్డుకుంటామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కూడా ఏపీ ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదులపై బనకచర్ల ప్రాజెక్టు అనుమతులు ఇప్పటికే నిలిచిపోయాయని భట్టి విక్రమార్క తెలిపారు.
ఖమ్మం జిల్లా మధిర మండలం వంగవీడు గ్రామం సమీపంలోని వైరా నదిపై రూ.630 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వాకిటి శ్రీహరి, ఎంపీ పోరిక బలరాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి భట్టి విక్రమార్క నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగర్ బ్యారేజీ, దేవాదుల ప్రాజెక్టులను సందర్శించి సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాయలసీమ ఎత్తిపోతల పథకాల ద్వారా ఏపీ ప్రభుత్వం రోజుకు 11 టీఎంసీల నీటిని తరలిస్తే, కేవలం 25 రోజుల్లో శ్రీశైలం జలాశయం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీని ఫలితంగా నల్లగొండ, ఖమ్మం జిల్లాల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More : నాలుగు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరిక
