ఆయేషా మీరా హత్య కేసు: High Court

ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ తుది దర్యాప్తు నివేదికను ఇవ్వాలంటూ హతురాలి తల్లిదండ్రులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిన్న (శుక్రవారం) విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది పిచ్చుక శ్రీనివాస్ వాదనలు వినిపించారు. “సీబీఐ తుది నివేదికను పొందేందుకు ఆయేషా తల్లిదండ్రులు అర్హులు. దాన్ని అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించాలి” అని ఆయన కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం – “ఆ నివేదిక సీబీఐ కోర్టులో ఉంది కదా, అక్కడ నుంచి తీసుకోవచ్చు కదా?” అని వ్యాఖ్యానించింది. అయితే ఈ కేసుకు సంబంధించి 18 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నామని, మళ్లీ కొత్తగా నివేదిక కోసం కోర్టులోకి వెళ్లాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. అంతేకాదు, సీబీఐ తన కౌంటర్ దాఖలు చేయకపోవడంతో జూలై 4వ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.

ఈ సందర్భంగా పిటిషనర్లు – “రీ పోస్టుమార్టం నివేదికలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు” అని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఈ అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇక సీబీఐ తుది నివేదికను ఇటీవలే హైకోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై హతురాలి తల్లిదండ్రులు షంషాద్ బేగం, ఇక్బాల్ బాషా మీడియాతో మాట్లాడారు. “సీబీఐ దర్యాప్తు న్యాయం చేయలేకపోయిందన్న అనుమానం కలుగుతోంది. ఇప్పటికీ ఏ రిపోర్ట్‌నే ఇవ్వలేదు. అందుకే చంద్రబాబు ఈ కేసును ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నాం” అంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

Read More : పీవీ నరసింహారావుకు ఘన నివాళి అర్పించిన సీఎం , మంత్రి లోకేశ్