ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనపై రెండు రాష్ట్రాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దీనిపై దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2022లో ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం తుది ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజకవర్గాల పెంపు ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు.
జమ్ముకశ్మీర్ లో పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టి రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. 170(3) అధికరణం ప్రకారం ఏపీ విభజన చట్టంలో సెక్షన్ 26కి పరిమితి ఉందని తెలిపింది. 2026లో మొదటి జన గణన తర్వాత మాత్రమే డీలిమిటేషన్ నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా చెప్పారని పేర్కొంది.
ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలన్న వ్యాజ్యాలు వరదల్లా వస్తాయని, గేట్లు తెరిచినట్లు అవుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్ కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉంటాయని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
జమ్మూకశ్మీర్ పై ప్రత్యేక దృష్టి సారించారన్న పిటిషనర్ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది.. జమ్మూకశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణను మినహాయించడం.. ఏకపక్షం, వివక్ష కాదని స్పష్టం చేస్తూ పురుషోత్తం రెడ్డి పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
కాగా, కొన్ని నెలలుగా డెలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలు ఏకతాటి పైకి రావడం, తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల అఖిలపక్షంతో సమావేశం కూడా నిర్వహించారు. ఇప్పుడు కొత్తగా చేపట్టబోయే జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుందని ఉత్తరాదికి లాభం చేకూరుతుందన్న వాదన ఉంది. మరి ఈ తీర్పుతో ఏపీ, తెలంగాణాతో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో, ముందుకెళ్తాయో చూడాలి.
Read More : ఏపీ లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి మరో ఎదురుదెబ్బ

One thought on “నియోజకవర్గాల పునర్విభజనపై పిటిషన్ ను కొట్టేసిన సుప్రీంకోర్టు”
Comments are closed.