ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో రెండో ఛార్జ్ షీట్‌ను మరికాసేపట్లో విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేయనుంది. దాదాపు 200 పేజీలతో రూపొందించిన ఈ ఛార్జ్ షీట్‌లో ముగ్గురు కీలక వ్యక్తుల పాత్రపై ఆధారాలను పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.
ఛార్జ్ షీట్‌లో కీలక వివరాలు
రెండో ఛార్జ్ షీట్‌లో ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పల పాత్రపై సిట్ దృష్టి సారించింది. వీరి కాల్ డేటా రికార్డులు, గూగుల్ టేక్ అవుట్ వివరాలు, ల్యాప్‌టాప్‌లోని డాక్యుమెంట్ల ఆధారంగా కీలకమైన అంశాలను చేర్చింది.
- ‘బిగ్‌బాస్’ ఆదేశాల మేరకే మద్యం విధానంలో మార్పులు, సిండికేట్ సమావేశాలు, ముడుపుల వ్యవహారం జరిగాయని సిట్ అధికారులు నిర్ధారించారు.
- ముడుపులను ఎలా సేకరించాలి, ఎక్కడ దాచాలి, నల్లధనాన్ని తెల్లగా ఎలా మార్చాలనే అంశాలపై బాలాజీ గోవిందప్ప సూచనలు చేశారని సిట్ గుర్తించింది.
- మద్యం విధానం రూపకల్పనలో ధనుంజయ్ రెడ్డి అడుగడుగునా జోక్యం చేసుకున్నారని, లిక్కర్ సిండికేట్ సమావేశాలకు కూడా హాజరయ్యారని గూగుల్ టేక్ అవుట్ సాక్ష్యాలు చూపిస్తున్నట్లు సమాచారం.
- ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కొంత సొమ్మును బినామీల పేర్లతో పెట్టుబడులు పెట్టినట్లు సాక్ష్యాలు సేకరించినట్లు సిట్ వెల్లడించింది.
- ఈ ముగ్గురు విజయ్ సాయిరెడ్డి, మిథున్ రెడ్డిలతో ఫోన్‌లో మాట్లాడిన వివరాలను కూడా అధికారులు సేకరించారు.
మొదటి ఛార్జ్ షీట్‌లో ఏం ఉంది?
గత నెల జులై 19వ తేదీన సిట్ 305 పేజీలతో తొలి ఛార్జ్ షీట్‌ను దాఖలు చేసింది. రాజ్ కేసిరెడ్డి ద్వారా ముడుపులు మిథున్ రెడ్డి, విజయ్ సాయిరెడ్డికి చేరాయని, అక్కడి నుంచి బాలాజీ గోవిందప్ప ద్వారా అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు చేరాయని మొదటి ఛార్జ్ షీట్‌లో సిట్ పేర్కొంది. ఛార్జ్ షీట్‌తో పాటు వివిధ డాక్యుమెంట్లు, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్క్‌లను మూడు ట్రంక్ పెట్టెల్లో కోర్టుకు సమర్పించింది.
Read More : ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి కందుల దుర్గేశ్ హామీ
