ఏపీ పండుగల కమిటీలకు శుభవార్త: Minister

nara lokesh

ఆంధ్రప్రదేశ్‌లో వినాయక చవితి, దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ పండుగల సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం ప్రకటించారు. వినాయక ఉత్సవ సమితుల నుంచి వచ్చిన వినతులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో చర్చలు జరిపిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వినాయక మండపాలకు మాత్రమే కాకుండా రాబోయే దసరా శరన్నవరాత్రి సందర్భంగా ఏర్పాటు చేసే దుర్గా పందిళ్లకూ ఈ సౌకర్యం వర్తించనుందని మంత్రి స్పష్టం చేశారు.

ఈ రెండు ప్రధాన పండుగల కోసం ఉచిత విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం రూ.25 కోట్లు ఖర్చు చేయనున్నట్లు లోకేశ్ వెల్లడించారు. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది ఉత్సవ కమిటీలకు ఆర్థికంగా పెద్ద ఊరట కలగనుంది.

Read More : రఘురామ కృష్ణంరాజుకు సుప్రీం కోర్టులో ఊరట