అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్‌పై చేసిన వ్యాఖ్యల వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారం తాజాగా మరో కీలక మలుపు తీసుకుంది. ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు గుత్తా ధనుంజయ నాయుడు సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే వర్గీయుల నుంచి తన కుటుంబానికి ప్రాణహాని ఉందని, తనపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ధనుంజయ మాట్లాడుతూ – “ఎమ్మెల్యే వర్గీయులు నా భార్య, సోదరుడిని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. ఆడియో నకిలీ అని చెప్పేలా నాపై ఒత్తిడి చేస్తున్నారు. ఎమ్మెల్యే వల్లే నా ప్రాణానికి ముప్పు ఉంది. పార్టీ కోసం కష్టపడి జైలుకు కూడా వెళ్లాను” అని వాపోయారు.
గతంలో ‘వార్ 2’ సినిమా విడుదల సందర్భంగా, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎన్టీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆడియోను ధనుంజయ లీక్ చేయగా, అనంతపురంలో ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన చేపట్టి, ఫ్లెక్సీలను చించివేశారు. ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఎన్టీఆర్‌తో పాటు ఆయన తల్లిని కూడా అవమానించినందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు.
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రసాద్ స్పందిస్తూ, తాను ఎప్పుడూ నందమూరి కుటుంబాన్ని గౌరవిస్తానని, ఆ ఆడియో తనది కాదని, అది రాజకీయ కుట్రలో భాగమని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఎవరి మనోభావాలైనా దెబ్బతిన్నాయంటే క్షమాపణ చెబుతున్నానని పేర్కొన్నారు.
ఇక ఈ వివాదంపై సీఎం చంద్రబాబు కూడా తీవ్రంగా స్పందించినట్టు సమాచారం. ఎమ్మెల్యేను పిలిపించి వివరణ కోరినట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకోవాలని అభిమానులు డిమాండ్ చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.
Read More : రాజమండ్రి పర్యటన వాయిదా – చంద్రబాబు, పవన్‌పై బొత్స ఫైర్
