అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుని తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నగరంలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది, ప్రయాణికులు సహా మొత్తం 265 మంది మృతి చెందారని అధికారులు ధృవీకరించారు. విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి.
ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారిక దర్యాప్తు ప్రారంభించనుంది. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు కీలకమైన బ్లాక్ బాక్స్ (ఫ్లైట్ డేటా రికార్డర్ మరియు కాక్‌పిట్ వాయిస్ రికార్డర్) ఇంకా లభ్యం కాలేదని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఈ బ్లాక్ బాక్స్ దొరికితే ప్రమాదానికి ముందు క్షణాల్లో ఏం జరిగిందో వెలుగులోకి రావొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు బ్లాక్ బాక్స్ లభ్యమైందన్న వార్తలు అబద్ధమని, అవి కేవలం ఊహాగానాలేనని ఎయిర్ ఇండియా పేర్కొంది.
ఇదిలా ఉండగా, విమానం అహ్మదాబాద్ విమానాశ్రయానికి సమీపంలోని మేఘానినగర్ ప్రాంతంలో ఉన్న ట్రైనీ వైద్యుల వసతి గృహాలపై కూలింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం తీరని విషాదంలో మునిగిపోయింది. సమీప ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బంది మొత్తం 242 మంది ఉన్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. వారిలో ఒకే ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడగా, మిగతావారు మృతి చెందారు. కాగా, విమానం నివాసాలపై కూలడంతో భూమిపై ఉన్న మరో 24 మంది పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 265కి చేరినట్టు అధికారులు నిర్ధారించారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. విచారణ పూర్తయిన తర్వాత ప్రమాదానికి గల అసలు కారణాలు వెలుగులోకి రావాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read More : ఫుకెట్ ఎయిర్ ఇండియా విమానంలో బాంబు కలకలం

One thought on “బ్లాక్ బాక్స్ కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది”
Comments are closed.