తనయుడి ప్లాప్ చిత్రంపై స్పందించిన అమీర్ ఖాన్!

Ameer Khan and Junaid Khan

ప్రఖ్యాత నటుడు అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్, శ్రీదేవి కుమార్తె ఖుషీ కపూర్ జంటగా నటించిన లవ్యాపా ఇటీవల విడుదలైంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సమీక్షలు పొందినా, బాక్సాఫీస్ వద్ద మాత్రం ఫలితం అందుకోలేకపోయింది. ఈ సినిమా కేవలం 8 కోట్ల రూపాయల వసూళ్లతోనే ముగిసింది.

అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ – ఫాంటమ్ స్టూడియోస్ కలిసి నిర్మించాయి. దాదాపు 60 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రం ఆర్థికంగా నిరాశపరిచింది.

తాజాగా, ఈ సినిమా ఫలితంపై అమీర్ ఖాన్ స్పందిస్తూ,
“జునైద్ ఇప్పటికీ అభ్యసించే దశలోనే ఉన్నాడు. ఒక విధంగా చూస్తే, ఈ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడం మంచిదే. విజయాల కంటే పరాజయాల నుంచే ఎక్కువగా నేర్చుకోవచ్చు. తప్పులను గుర్తించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవచ్చు. ప్రస్తుతం జునైద్ కూడా అదే చేస్తున్నాడు. నిజానికి, జునైద్‌ను చూస్తూ నేనూ కొన్ని విషయాలు నేర్చుకోవాలి” అని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

జునైద్ ఖాన్ గత ఏడాది మహారాజ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అంతకుముందు పీకే సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పని చేశాడు. ప్రస్తుతం ఏక్ దిన్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయికగా కనిపించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయినప్పటికీ, మేకర్స్ ఇంకా ప్రమోషన్ ప్రారంభించలేదు. ఈ సినిమా ఈ ఏడాదిలోనే విడుదల కానుందని సమాచారం.

Read More

One thought on “తనయుడి ప్లాప్ చిత్రంపై స్పందించిన అమీర్ ఖాన్!

Comments are closed.