Vitamin E Foods | నట్స్, సీడ్స్‌లోనే కాదు.. విటమిన్ ఇ ఈ పండ్లు, కూరగాయల్లోనూ ఉంటుంది..!
మన శరీరానికి అవసరమైన అనేక రకాల విటమిన్లలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా కణాలను రక్షించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా విటమిన్ ఇ పాత్ర అమోఘం. కాబట్టి విటమిన్ ఇ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవడం అనివార్యం.
ఎంతో మంది విటమిన్ ఇ అనగానే పలు రకాల నట్స్, విత్తనాలు గుర్తుకు తెచ్చుకుంటారు. కానీ, ఈ విటమిన్ పలు రకాల పండ్లు, కూరగాయల్లో కూడా లభిస్తుంది. కేవలం ఖరీదైన నట్స్, సీడ్స్ మాత్రమే కాకుండా వీటిని తినడం ద్వారా కూడా మనకు విటమిన్ ఇని సులభంగా పొందవచ్చు.
పాలకూర
పాలకూరలో ఐరన్ మాత్రమే కాకుండా విటమిన్ ఇ కూడా అధికంగా ఉంటుంది. ఒక కప్పు ఉడికించిన పాలకూరను తింటే సుమారు 4 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది, ఇది రోజువారి అవసరానికి 25% సమానం. కాబట్టి పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు.
అవకాడో
ఒక మధ్యస్థ అవకాడో తినడం ద్వారా 4.2 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. రోజువారి ఆహారంలో అవకాడో ముక్కలను చేర్చి తినడం లేదా సలాడ్లపై వేసుకుని తినవచ్చు. అవకాడోలో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత సమస్యల నుండి రక్షణ కలుగుతుంది.
ఎరుపు క్యాప్సికమ్
ఎరుపు రంగు క్యాప్సికమ్ విటమిన్ ఇకు మంచి మార్గం. ఒక కప్పు క్యాప్సికమ్‌లో 1.9 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ ఉంటుంది. వీటిలో విటమిన్ సి కూడా అధికంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యాప్సికమ్‌ను కూరల్లో లేదా సలాడ్‌లలో తినవచ్చు.
కివి పండ్లు
కివిలో కేవలం విటమిన్ సి మాత్రమే కాదు, విటమిన్ ఇ కూడా ఉంటుంది. ఒక కివి పండును తినడం ద్వారా 1.1 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది. స్నాక్స్ రూపంలో లేదా పెరుగులో కలిపి తినవచ్చు.
టమాటాలు
టమాటాల్లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ ఇ కూడా అధికంగా ఉంటుంది. ఎండలో ఎండబెట్టిన టమాటాల్లో విటమిన్ ఇ శాతం మరింత పెరుగుతుంది. ఒక కప్పు ఎండబెట్టిన టమాటాలను తింటే 2.8 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ లభిస్తుంది.
బ్రోకలి
ఉడికించిన బ్రోకలిలో 2.3 మిల్లీగ్రాముల మేర విటమిన్ ఇ ఉంటుంది. బ్రోకలిని సూప్‌లలో లేదా నేరుగా వేయించి తినవచ్చు.
ఈ విధంగా విటమిన్ ఇ అందించే పండ్లు, కూరగాయలను రోజువారి ఆహారంలో చేర్చడం ద్వారా శరీరానికి అవసరమైన విటమిన్ ఇ ను సమృద్ధిగా పొందవచ్చు. ఇది కేవలం చర్మం, గుండె ఆరోగ్యానికి కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
