చైనాకు అమెరికా ఆంక్షలు: అరుదైన మూలకాలపై ఎగుమతి నిషేధం

చైనా ఇంటర్నెట్ డెస్క్: చైనాలో కంప్యూటర్ చిప్స్ తయారీ పరిశ్రమపై అమెరికా ఆంక్షలు విధించిన కొన్ని గంటల్లోనే, బీజింగ్ తీవ్రంగా స్పందించింది. అరుదైన మూలకాలతో తయారయ్యే వస్తువులపై అమెరికాకు ఎగుమతి చేయకూడదని చైనా నిషేధం విధించింది. ముఖ్యంగా సైనిక, పౌర అవసరాలకు ఉపయోగించే గాలియం, జెర్మేనియం, యాంటీమోనీ, సూపర్ హార్డ్ పదార్థాలకు ఈ నిషేధం వర్తించనుంది. అలాగే, గ్రాఫైట్ ఎగుమతుల విషయాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తమ దేశ ప్రయోజనాలు మరియు జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చైనా పేర్కొంది.

అమెరికా జాతీయ భద్రతను సాకుగా చూపించి, ఆర్థిక, వాణిజ్య, టెక్నాలజీ అంశాలను ఆయుధాల్లా వాడుతోందని చైనా ఆరోపించింది.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మరో నెలలో బాధ్యతలు చేపట్టనున్న సమయంలో, చైనాతో వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. కొత్త ఆంక్షల జాబితాలో ఉన్న వాటిని ఎగుమతి చేసే సంస్థలు వాటి అంతిమ వినియోగదారు పేరును ప్రభుత్వానికి వెల్లడించాల్సి ఉంటుంది. దీని ద్వారా, అమెరికా ఆయుధ తయారీ సంస్థల్లో చైనాపై ఆధారపడిన వాటిని గుర్తించవచ్చు.

ప్రపంచవ్యాప్తంగా అరుదైన ఖనిజాల అన్వేషణలో చైనా చాలా ముందంజలో ఉంది. ఇటీవల, అమెరికా 24 రకాల సెమీకండక్టర్ తయారీ పరికరాలు, మూడు రకాల సాఫ్ట్‌వేర్ టూల్స్ ను చైనాకు ఎగుమతి చేయడంపై ఆంక్షలు విధించింది. ఇవన్నీ చిప్స్ తయారీలో ఉపయోగిస్తారు. అంతేకాకుండా, చైనా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తున్న 140 కంపెనీలను కూడా అమెరికా బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది.

జెర్మేనియం అనేది జింక్, కోల్ ఫ్లైయాష్ ఉపఉత్పత్తి. చైనా దీనిని అత్యధికంగా 60% ఎగుమతి చేస్తోంది, తరువాత కెనడా, ఫిన్లాండ్, రష్యా, అమెరికా ఉన్నాయి. గాలియం కూడా జింక్, బాక్సైట్ ఖనిజాల నుంచి లభిస్తుంది, దీన్ని 80% చైనా ఉత్పత్తి చేస్తుంది.