సుప్రీంకోర్టు: బెయిలు వచ్చిన మరునాడే మంత్రి పదవీ…
నగదు మోసం కేసులో బెయిలుపై విడుదలైన మరుసటి రోజు మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఎంత అవసరమని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తమిళనాడులో ఈ ఘటనపై అత్యున్నత న్యాయస్థానం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రి సెంథిల్ బాలాజీ (Minister Senthil Balaji)పై నగదు మోసం కేసు నమోదైన విషయం తెలిసిందే. రవాణా శాఖ మంత్రి గా ఉన్నప్పుడు అతను ఉద్యోగాలిచ్చి నగదు వసూలుచేసి మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో, సెంథిల్ బాలాజీపై అవినీతి ఆరోపణలు ఉండటంతో, ఈడీ అధికారులు అతన్ని 2023 జూన్ 14న అరెస్టు చేశారు. అతను 471 రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత, సుప్రీంకోర్టు బెయిలును మంజూరు చేసింది.
ఆ తర్వాత, సెంథిల్ బాలాజీ బెయిలు మీద విడుదలైన మరుసటి రోజే మంత్రిగా ప్రమాణం చేశాడు. దీనిపై ఒక పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. పిటిషన్‌లో, ఆయన మంత్రిగా ప్రమాణం చేయడం వల్ల సాక్ష్యాలను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సుప్రీంకోర్టులో విచారణ సమయంలో ధర్మాసనం, “అతను బెయిలు వచ్చిన మరుసటిరోజే మంత్రిగా ప్రమాణం చేయాల్సిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించింది. అలాగే, మంత్రిగా ఉన్న సెంథిల్ బాలాజీ సాక్ష్యాలను ప్రభావితం చేయకుండా ఉండగలడా అని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ వ్యవహారంపై సెంథిల్ బాలాజీ నుంచి వివరణ కోరుతూ, తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
