దేశంలోని హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలపై సుప్రీంకోర్టు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 14 మంది హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సిఫారసు చేయగా, వారిలో ముగ్గురు న్యాయమూర్తులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు రానున్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి అధ్యక్షతన సమావేశమైన కొలీజియం, గుజరాత్ హైకోర్టు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్, అలహాబాద్ హైకోర్టు జస్టిస్ డి. రమేశ్, కోల్‌కతా హైకోర్టు జస్టిస్ శుభేందు సమంతలను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. వీరి బదిలీకి రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ ముగ్గురూ గతంలో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తులుగా సేవలందించారు. అంతేకాకుండా, వారిలో ఇద్దరు న్యాయమూర్తులు ఏపీకి చెందిన వారే కావడం విశేషం.
జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్: విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన ఆయన, విశాఖపట్నంలోని ఎంవీపీ లా కళాశాలలో న్యాయ విద్య పూర్తి చేశారు. 1988లో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, 2002లో జిల్లా సెషన్స్ జడ్జిగా ఎంపికయ్యారు. 2015–2018 మధ్య ఉమ్మడి హైకోర్టులో రిజిస్ట్రార్ జనరల్‌గా సేవలందించారు. 2019లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, తర్వాత గుజరాత్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఏపీ హైకోర్టుకు రానున్నారు.
జస్టిస్ డి. రమేశ్: చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం, కమ్మపల్లికి చెందిన ఆయన, నెల్లూరులోని వీఆర్ లా కళాశాలలో న్యాయ విద్య పూర్తిచేశారు. 1990లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించి, ప్రభుత్వ న్యాయవాదిగా, స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. 2020లో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, 2023లో అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు ఆయన తిరిగి ఏపీ హైకోర్టుకు రానున్నారు.
జస్టిస్ శుభేందు సమంత: పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆయన, కోల్‌కతా యూనివర్సిటీలో న్యాయ విద్య పూర్తి చేశారు. తమ్లుక్ కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి, తర్వాత న్యాయాధికారిగా పలు కీలక పదవులు నిర్వహించారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థాన జడ్జిగా, కోల్‌కతా సిటీ సెషన్స్ కోర్టు చీఫ్ జడ్జిగా పనిచేశారు. 2022లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన ఇప్పుడు ఏపీ హైకోర్టుకు బదిలీ కానున్నారు.
Read More : విశాఖపట్నంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన

One thought on “ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీ”
Comments are closed.