2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యం వైపు భారత్ మరో కీలక అడుగు వేసింది. ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు భారత్ తరపున దాఖలు చేయనున్న బిడ్‌కు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధికారిక ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో (ఎస్‌జీఎం) ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ను ప్రధాన వేదికగా ప్రతిపాదిస్తూ బిడ్ రూపకల్పన జరుగుతోంది. కెనడా పోటీ నుంచి తప్పుకోవడంతో భారత్‌కు ఆతిథ్య హక్కులు దక్కే అవకాశాలు మరింత పెరిగాయి. ఇప్పటికే ప్రాథమిక ఆసక్తి తెలిపిన భారత్, ఆగస్టు 31లోపు తుది బిడ్ పత్రాలు సమర్పించనుంది. ఈ క్రీడల నిర్వహణ ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించనుందని ఐఓఏ స్పష్టం చేసింది.
సమావేశం అనంతరం ఐఓఏ జాయింట్ సెక్రటరీ కల్యాణ్ చౌబే మాట్లాడుతూ, “జనరల్ హౌస్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇకపై సన్నాహాలను వేగవంతం చేస్తాం” అని తెలిపారు. ఇటీవల కామన్వెల్త్ స్పోర్ట్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని బృందం అహ్మదాబాద్‌లోని క్రీడా వేదికలను పరిశీలించి, గుజరాత్ ప్రభుత్వ అధికారులతో సమావేశమైంది. ఈ నెలలో మరో ప్రతినిధి బృందం పర్యటించనుంది.
2026 గ్లాస్గో గేమ్స్‌కి భిన్నంగా, 2030లో పూర్తిస్థాయిలో అన్ని క్రీడాంశాలతో పోటీలు నిర్వహించనున్నామని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు రోహిత్ రాజ్‌పాల్ తెలిపారు. షూటింగ్, ఆర్చరీ, రెజ్లింగ్ వంటి భారత్‌కు పతకాలు తెచ్చే క్రీడలతో పాటు కబడ్డీ, ఖో-ఖో వంటి దేశీయ క్రీడలను కూడా చేర్చాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీ నవంబర్ చివరలో గ్లాస్గోలో సమావేశమై తుది ఆతిథ్య దేశాన్ని ప్రకటించనుంది. భారత్ గతంలో 2010లో ఢిల్లీలో ఈ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
Read More : ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ
