కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ఆలస్యంపై కేటీఆర్ విమర్శలు

కొత్వాల్‌గూడ ఎకో పార్క్ పనుల ఆలస్యంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సేవ కంటే రాజకీయాలు, ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తోందని మండిపడ్డారు. ప్రస్తుత ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే పార్క్ ప్రారంభం ఆలస్యమైందని కేటీఆర్ ఆరోపించారు. కేటీఆర్ మాట్లాడుతూ – “బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు రెండేళ్ల క్రితమే మెజార్టీ పనులు పూర్తి చేసింది. అయినా ఈరోజు వరకు పార్క్ ప్రారంభం కాని దుస్థితి నెలకొంది. హైదరాబాదీల కోసం అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ కాంగ్రెస్ పాలనలో నిలిచిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సౌకర్యాలు, అభివృద్ధి పనులను పక్కనబెట్టి ప్రచార యాత్రలకే ప్రాధాన్యత ఇస్తోంది. ఇది నిస్సహాయ ప్రభుత్వం, నిస్సహాయ పాలనకు నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.

ఎకో పార్క్ వివరాలు చూస్తే – అవుటర్ రింగ్ రోడ్ పరిధిలోని హిమాయత్‌సాగర్ పక్కన 85 ఎకరాల్లో హెచ్‌ఎండీఏ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే పక్షిశాల సిద్ధమై, ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 1,500 రకాల పక్షులను సేకరించి స్థానిక వాతావరణానికి అలవాటు చేస్తున్నారు.

అలాగే చిన్నారుల నుంచి పెద్దల వరకు రోజంతా ఆస్వాదించగల వివిధ అడ్వెంచర్ గేమ్స్‌ను రూపొందిస్తున్నారు. వీటిలో స్కై బ్రిడ్జి, రోలర్ కోస్టర్, జిప్‌లైన్, క్లైంబింగ్ వాల్, సస్పెన్షన్ బ్రిడ్జి, జాయింట్ స్వింగ్, ఫ్లయింగ్ కప్, హ్యూమన్ స్లింగ్‌షాట్, జిప్ బైక్, 360 డిగ్రీల ఫ్లైయింగ్ సైకిల్, రోప్ కోర్సు, బంగీ ట్రంప్‌లైన్ వంటి వినోద సౌకర్యాలు ఉండనున్నాయి.

Read More : ఈడీ విచారణకు హాజరైన నటి మంచు లక్ష్మి

One thought on “కొత్వాల్‌గూడ ఎకో పార్క్ ఆలస్యంపై కేటీఆర్ విమర్శలు

Comments are closed.