టాలీవుడ్లో సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదం రోజురోజుకూ కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ అంశం కేవలం ఇండస్ట్రీలోనే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖ నిర్మాతలు తమ అభిప్రాయాలను మీడియా ముందు వెల్లడించారు.
“పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు చేస్తారు?” – ఎస్కెఎన్
నిర్మాత ఎస్కెఎన్ మాట్లాడుతూ, “వేతనాలను 50% పెంచడం ఓకే, కానీ మన సినిమాలకు పెట్టిన పెట్టుబడికి తగ్గ బిజినెస్ ఎవరు హామీ ఇస్తారు? ఆ బాధ్యత కార్మిక సంఘాలు తీసుకుంటాయా?” అని ప్రశ్నించారు. చిన్న సినిమాలకు తగిన వేతనాలు కార్మికులు తీసుకోవడం లేదని చెప్పారు. 2000 రూపాయలలోపు వేతనం పొందే వారికి మాత్రం పెంపు ఇస్తామని గుర్తు చేశారు. పెద్ద సినిమాలకు మాత్రమే టికెట్ రేట్లు పెరుగుతాయని, వాటి సంఖ్య ఏడాదికి పది మాత్రమే ఉంటుందని, మిగతా 200 సినిమాలు చిన్నవేనని వివరించారు. ఇండస్ట్రీలో ఇబ్బంది పడుతున్న నిర్మాతలకు ఎవరూ అండగా నిలబడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
“నిర్మాతలను కూడా పట్టించుకోవాలి” – రాజేష్ దండ
నిర్మాత రాజేష్ దండ మాట్లాడుతూ, నిర్మాతలకు రావాల్సిన పేమెంట్లు ఆలస్యం అవుతున్నప్పటికీ, కార్మికుల వేతనాలు మాత్రం సమయానికి ఇవ్వాలని ఒత్తిడి ఉంటుందని తెలిపారు. తన గత చిత్రానికి కావలసిన 250 మంది వర్కర్స్ రాలేదని, ఆ సమయంలో ఫెడరేషన్ స్పందించలేదని ప్రశ్నించారు. నిర్మాతల పరిస్థితిని కూడా యూనియన్ నాయకులు గుర్తించాలని సూచించారు.
“యూనియన్ రూల్స్ వల్ల ఖర్చులు పెరుగుతున్నాయి” – మధుర శ్రీధర్
నిర్మాత మధుర శ్రీధర్ మాట్లాడుతూ, సినిమాకి అవసరం నలుగురికే ఉన్నా, యూనియన్ రూల్స్ వల్ల 80 మందిని తీసుకోవాల్సి వస్తోందని తెలిపారు. 50 లక్షల్లో పూర్తి చేయగల కథ, ఈ నియమాల వల్ల రెండు కోట్ల ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాతలపై ఈ విధమైన భారం వేయడం అన్యాయం అని విమర్శించారు.
“ఇప్పటి పరిస్థితుల్లో వేతన పెంపు భారమే” – చైతన్య రెడ్డి
నిర్మాత చైతన్య రెడ్డి మాట్లాడుతూ, “ప్రస్తుత పరిస్థితుల్లో వేతన పెంపు నిర్మాతలకు భారమే” అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు సరిగా నడవడం లేదని, అందువల్ల పరిస్ధితులకు తగ్గట్టు సర్దుబాటు అవసరమని సూచించారు. ఎవరూ లాభాల్లో లేరని, కేవలం ప్యాషన్‌తోనే సినిమాలు తీస్తున్నామని అన్నారు. కోవిడ్ తర్వాత కూడా కార్మికుల వేతనాలు పెంచామని గుర్తు చేశారు.
Read More : ‘ప్రభాస్ పెళ్లి త్వరలో జరుగుతుంది’: కృష్ణంరాజు సతీమణి
