2008 మలేగావ్ బాంబు పేలుడు కేసు

2008 మలేగావ్ బాంబు పేలుడు కేసులో ఎట్టకేలకు తీర్పు వెలువడనుంది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక కోర్టు ఈ రోజు (గురువారం) తుది తీర్పును ప్రకటించనుంది. ఈ తీర్పు కోసం దేశ ప్రజలు, ముఖ్యంగా బాధిత కుటుంబాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.

ఈ కేసులో లెఫ్టినెంట్ కల్నల్ ప్రసాద్ పురోహిత్, బీజేపీ మాజీ ఎంపీ ప్రగ్యా సింగ్ ఠాకూర్, రిటైర్డ్ మేజర్ రమేశ్ ఉపాధ్యాయతో పాటు మొత్తం ఏడుగురు నిందితులు ఉన్నారు. వీరిపై అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్‌ (యుఏపీఏ)తో పాటు భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) కింద పలు తీవ్రమైన ఆరోపణలు నమోదయ్యాయి. ప్రస్తుతం వీరంతా బెయిల్‌పై బయట ఉన్నారు. తీర్పు రోజున నిందితులందరూ కోర్టుకు తప్పనిసరిగా హాజరుకావాలని, గైర్హాజరైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కోర్టు ఇప్పటికే ఆదేశించింది.

ఈ ఏడాది ఏప్రిల్ 19న ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు పూర్తయ్యాయి. లక్షకు పైగా పేజీల సాక్ష్యాధారాలు, డాక్యుమెంట్లను పరిశీలించడం వల్ల తీర్పు రాయడానికి సమయం పట్టిందని కోర్టు పేర్కొంది.

మలేగావ్ పేలుడు – ఏం జరిగింది?
2008 సెప్టెంబర్ 29న రంజాన్ నెలలో, నవరాత్రి పండుగ సందర్భంగా మహారాష్ట్రలోని మలేగావ్‌లో మసీదు సమీపంలో నిలిపివుంచిన మోటార్‌సైకిల్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ దారుణ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ సంఘటన అప్పట్లో సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది.

విచారణలో మలుపులు
దశాబ్దకాలంగా సాగిన విచారణలో 323 మంది సాక్షులను ప్రాసిక్యూషన్ విచారించగా, వీరిలో 34 మంది వాంగ్మూలం మార్చారు. మొదట్లో మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్‌ (ఏటీఎస్) దర్యాప్తు చేసిన ఈ కేసు 2011లో ఎన్‌ఐఏకు బదిలీ అయింది. 2016లో ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ప్రగ్యా సింగ్ ఠాకూర్‌తో పాటు కొందరు నిందితులపై సరిపడ సాక్ష్యాలు లేవని పేర్కొంది. అయినప్పటికీ, కోర్టు ఆమెపై విచారణ కొనసాగించాలని ఆదేశించింది.

దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వెలువడుతున్న ఈ తీర్పు దేశ భద్రత, న్యాయ వ్యవస్థ, రాజకీయాలపై ప్రభావం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బాధిత కుటుంబాలు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో తీర్పు కోసం ఎదురుచూస్తున్నాయి.

One thought on “2008 మలేగావ్ బాంబు పేలుడు కేసు

Comments are closed.