జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అన్ని పార్టీల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ వైపు అధిస్థానం మొగ్గు చూపుతున్న వేళ.. ఆ టికెట్ ఆశావహుడు ఫిరోజ్ ఖాన్ మీడియా ముందుకు వచ్చాడు. స్థానికులకే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారాయన.
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వయనాడ్ లో పుట్టి, పెరిగారా? వాళ్లెందుకు వయనాడ్ లో పోటీ చేస్తున్నారు? అని ఫిరోజ్ ఖాన్ ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ అనేది అభ్యర్థి సత్తా, ప్రచారం జరిగే తీరుపై ఆధారపడి ఉంటాయని అన్నారు. “సీఎం ఉండే నియోజకవర్గం ఇది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం. జూబ్లీహిల్స్ లో ఇల్లు ఉంటేనే సీటు ఇస్తారా?. వయనాడ్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ స్థానికులా?. స్థానికులకే ఇస్తామనడం సరికాదు”… అని ఫిరోజ్ ఖాన్ అభ్యంతరాలు వ్యక్తం చేశాడు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల రేసులో తొలి నుంచి అజారుద్దీన్ తో పాటు రోహిన్ రెడ్డి, విజయారెడ్డి, ఫిరోజ్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఫిరోజ్ ఖాన్ ఇప్పటిదాకా నాలుగుసార్లు నాంపల్లి (హైదరాబాద్) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఒకసారి ప్రజారాజ్యం, ఒకసారి టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడారాయన. అయితే.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో.. నాంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ ఖాన్ పోటీ చేసి ఓడారు. మజ్లిస్ అభ్యర్థి మాజిద్ హుస్సేన్ కు 39,360 ఓట్లు రాగా, ఫిరోజ్ కు 36,363 ఓట్లు పోలయ్యాయి. సోషల్ మీడియాలోనూ ఫిరోజ్ ఖాన్ స్పీచ్ లకు, డైలాగులకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. మరి ఫిరోజ్ ఖాన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం, కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో, ఎవరికి టికెట్ ఖరారు చేస్తారో చూడాలి.
