మేఘాలయలో 4 వేల టన్నుల బొగ్గు మాయం

మేఘాలయలో వేల టన్నుల బొగ్గు మాయం కావడం సంచలనంగా మారింది. గనుల నుంచి తవ్వి డిపోలలో నిల్వ చేసిన సుమారు 4 వేల టన్నుల బొగ్గు అదృశ్యమవడంతో పాటు అమ్మకాల లెక్కల్లోనూ ఆ బొగ్గు కనబడకపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన రాజాజు, దియంగన్ గ్రామాల్లోని రెండు బొగ్గు నిల్వ కేంద్రాల్లో చోటుచేసుకుంది.

అక్రమ రవాణా జరిగి ఉండొచ్చని ఆరోపణలు వినిపిస్తుండగా, ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన మేఘాలయ హైకోర్టు ప్రభుత్వం మీద తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బొగ్గు మాయం వెనక ఉన్న బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి కీర్మెన్ షిల్లా ఇచ్చిన వివరణ చర్చనీయాంశంగా మారింది. ఆయన ప్రకారం, మేఘాలయలో కురిసిన భారీ వర్షాల కారణంగా డిపోలలో నిల్వ చేసిన బొగ్గు వరద నీటితో కొట్టుకుపోయి బంగ్లాదేశ్ లోకి చేరి ఉండొచ్చని తెలిపారు. మేఘాలయ దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాలలో ఒకటని, తూర్పు జైంతియా హిల్స్ నుంచి వరద నీరు బంగ్లాదేశ్ వైపు ప్రవహిస్తుందని గుర్తుచేశారు.

అక్రమ రవాణా ఆరోపణలకు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని, ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నదని మంత్రి స్పష్టం చేశారు.

Read More : అపార్ట్‌మెంట్ మెయింటెనెన్స్‌పై జీఎస్టీకి స్పష్టత

One thought on “మేఘాలయలో 4 వేల టన్నుల బొగ్గు మాయం

Comments are closed.