మీకు పనస పండు అంటే ఇష్టమా.. అయితే డ్రైవింగ్ చేసేముందు మాత్రం పనస పండు తినకండి!!అదేంటి..ఎందుకు ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారా.. ఎందుకో మీరే చదివేయండి..
“పనస పండు” తిని వాహనాలు నడుపుతున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడ్డట్లే. ఒకవేళ పోలీసులు “డ్రంక్ అండ్ డ్రైవ్” టెస్ట్ నిర్వహిస్తే, మీరు మద్యం తాగకున్నా తాగినట్లు రీడింగ్ చూపించే అవకాశం ఉంది. కేరళకు చెందిన ఈ సంఘటనను పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుంది. ముగ్గురు ప్రభుత్వ బస్సు డ్రైవర్లు ఇదే విధంగా దొరికారు. వారంతా ఒక్క చుక్క మద్యం తాగకున్నా కూడా తాగినట్లు రీడింగ్ వచ్చింది.
పతనంతిట్ట జిల్లాలోని పండలం డిపోలో కేరళ స్టేట్ ఆర్టీసీ బస్సు డ్రైవర్లు మద్యం సేవించి నడిపినందుకు కేసులు నమోదయ్యాయి. అయితే, తాము ఎలాంటి మద్యం సేవించలేదని చెప్పారు. గత వారం జరిగిన ఈ సంఘటనను పరిశీలిస్తే, వీరు బస్సు నడిపే ముందు వీరికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు జరిగాయి. అది 10 బ్లడ్ ఆల్కహాల్ రీడింగ్ ను చూపించింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోవడం డ్రైవర్ల వంతైంది. ఈ రీడింగ్ చట్టబద్ధంగా అనుమతించిన పరిధి కన్నా చాలా ఎక్కువ. తాము ఏ విధంగా మద్యాన్ని తీసుకోలేదని చెప్పారు.
అయితే, గదిలో ఉన్న ఏకైక వస్తువు “పనస పండు”పై వీరికి అనుమానం వచ్చింది. పనస పండు అతిగా పండినప్పుడు దాని నుంచి వచ్చే పులియపెట్టిన వాసన బ్రీత్ అనలైజర్లను తప్పుదారి పట్టించినట్లు తేలింది. పనసపండు బలమైన ఫర్మెంటేషన్ ప్రాసెస్ కి ప్రసిద్ధి చెందిన ఒక పండు. దీంతో కేఎస్ ఆర్టీసీ అధికారులు మరో ప్రయోగాన్ని నిర్వహించి దీనిని రూఢీ చేసుకున్నారు. పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన డ్రైవర్ కు అదే పనస పండు ముక్కలను ఇచ్చి, తినమని కోరారు. ఆ తర్వాత బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ నిర్వహించగా, మద్యం తాగినట్లు రీడింగ్ వచ్చింది. దీంతో అసలు విషయం అధికారులకు అర్థమైంది. బాగా పండిన పనస పండులోని పులియబడిన చక్కెరలు, ఆల్కాహాల్ ఉనికిని సూచించిచాయి. ఈ పనస పండుని కొల్లం జిల్లాలోని కొట్టారక స్థానికుడు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే పనస పండు తిని బయటికెళ్లాలన్నా ఇదొక సమస్యగా మారుతుందా అని పలువురు సామాన్యులు అభిప్రాయపడుతున్నారు.
Note : Driving under the influence of alcohol is dangerous and illegal, and it’s crucial to prioritize safety by not drinking and driving.
