సినీ నటుడు, నిర్మాత మంచు మోహన్‌బాబుపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. 2019లో తిరుపతి–మదనపల్లె జాతీయ రహదారిపై తన విద్యాసంస్థలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ విద్యార్థులతో కలిసి ధర్నా చేసిన నేపథ్యంలో, మోహన్‌బాబు, ఆయన కుమారులు విష్ణు, మనోజ్‌లతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ధర్నా నిర్వహించారన్న అభియోగాలపై తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ మోహన్‌బాబు ఈ ఏడాది మార్చి 30న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై మంగళవారం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ విశ్వనాథన్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదిస్తూ, ప్రభుత్వ ఫీజు బకాయిలను తీసుకురావడమే లక్ష్యంగా నిరసన చేసినందుకే కోడ్ ఉల్లంఘనగా కేసు నమోదు చేశారని తెలిపారు. దీనిపై ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది ప్రేరణ సింగ్ స్పందిస్తూ, ఆ ధర్నా కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిందని పేర్కొన్నారు.
దీనిపై స్పందించిన జస్టిస్ నాగరత్న, “ఎంతమంది ఆ నిరసనలో పాల్గొన్నారు?” అని ప్రశ్నించగా, “కొంతమంది మాత్రమే” అని ప్రభుత్వం తరఫు న్యాయవాది బదులిచేశారు. దీనిపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం, “ప్రతి పౌరుడికి రాజ్యాంగపరంగా నిరసన తెలిపే హక్కు ఉంది. అలాంటప్పుడు విచారణ లేకుండా కేసులు ఎలా నమోదు చేస్తారు?” అని ప్రశ్నించింది.
ఇక ఇదే కేసులో తిరుపతిలోని ట్రయల్ కోర్టు విచారణకు మోహన్‌బాబు హాజరవాల్సిందిగా గతంలోనే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకురాగానే, తదుపరి విచారణ ఎప్పుడని జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. “ఈ గురువారమే” అని న్యాయవాది బదులిచేశారు.
చివరగా, ఇరుపక్షాలూ తమ వాదనలను రాతపూర్వకంగా ఈ నెల 25లోపు సమర్పించాల్సిందిగా ధర్మాసనం ఆదేశిస్తూ, తుది తీర్పును రిజర్వ్ చేసింది.
Read More : హీరోలలో మేకవన్నె పులులను కళ్ళారా చూసాను – మాళవిక

One thought on “మోహన్‌బాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు”
Comments are closed.