ప్రకృతి కన్నెర్ర చేస్తే మనుషులు నిస్సహాయులుగా ఉండడం తప్పా ఏమి చేయలేమన్నది జగమెరిగిన సత్యం. దీనికి ఉదాహరణ తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఘటన. అక్కడి రిపోర్టర్ ఒకరు వరద పరిస్థితిని కవర్ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించి తన ప్రాణాన్ని కోల్పోయే పరిస్థితిని తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లలో పెద్ద చర్చకు దారి తీసింది. పాకిస్తాన్ లోని సింధ్ ప్రాంతంలో తాజాగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల తీవ్రతతో వరదలు అదుపుతప్పి జనజీవనాన్ని ముంచెత్తాయి. దీనితో అక్కడ మౌలిక సదుపాయాల్లేని పరిస్థితుల్లో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లు కొట్టుకుపోతుండగా, వంతెనలు కూలిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక రిపోర్టర్ వరద ప్రాంతానికి వెళ్లి అక్కడి పరిస్థితిని రికార్డు చేయాలనుకున్నారు.
వాస్తవానికి అతడు ఎటువంటి ప్రమాదమూ లేకుండా దూరం నుంచి కెమెరామెన్ సహాయంతో రిపోర్టింగ్ చేసినా సరిపోతుంది. వరద తీవ్రత కెమెరాతో షూట్ చేసి చూపించొచ్చు. అయితే, ఈ రిపోర్టర్ మాత్రం అక్కడి పరిస్థితిని తక్కువ అంచనా వేశాడో ఏమో మరి.. ఇంకేముంది అన్నట్టు నేరుగా వరద నీటిలోకి అడుగుపెట్టాడు. అలా వెళ్లిన అతడు కొన్ని సెకన్ల పాటు నిలదొక్కుకుని రిపోర్టింగ్ చేసాడు. అలా చేస్తున్న సమయంలో వరద ప్రవాహం పెరిగి, చూస్తుండగానే అతడిని ముంచేసింది. అయితే ఆ తర్వాత ఏమైంది అన్నది ఆ వీడియో లో లేదు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ చాలా మంది ఆ రిపోర్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందులో కొందరు..రిపోర్టర్ ప్రాణం పోయిన తర్వాత అతని కుటుంబానికి ఎవరు అండగా ఉంటారు? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో.. రిపోర్టింగ్ చేయడం తప్పు కాదు, కానీ ప్రాణాల్ని పణంగా పెట్టి చేయాల్సిన అవసరం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ రిపోర్టర్ ఇప్పుడు ఎలా ఉన్నాడో, ఏమో!

One thought on “రిపోర్టింగ్ చేయడానికి అంత సాహసం చేయాలా?”
Comments are closed.