ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చోడవరం నియోజకవర్గంలో జరిగిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా, పెంచిన పెన్షన్లను లబ్దిదారుల ఇంటివద్దకే అందిస్తున్నామన్నారు. ఐదేళ్లలో పంపిణీ చేసిన పెన్షన్ మొత్తంతో ఐదు పోలవరం ప్రాజెక్టులు నిర్మించవచ్చని మంత్రి పేర్కొన్నారు. హామీల అమలులో ఎక్కడా రాజీపడట్లేదన్నారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయని ఆరోపించారు. “మూడు రాజధానుల మాట చెప్పి ఒక్క రాజధాని కూడా నిర్మించలేదు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడిదారులను వెనక్కి పంపించారు. మద్యం, ఇసుక, మైనింగ్, భూకబ్జా వంటి రంగాల్లో అక్రమాలు పెరిగాయి. ఇప్పుడు చంద్రబాబు గారి నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఈ తప్పులను సరిదిద్దుతోంది” అని మంత్రి నిమ్మల వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మలతో పాటు ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ, కేఎస్ఎన్ఎస్ రాజు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తదితరులు పాల్గొన్నారు.
Read More : తిరుమలలో టీటీడీ ఉద్యోగుల సస్పెన్షన్
