రాజాసింగ్ రాజీనామాను ఆమోదించిన బీజేపీ

తెలంగాణ బీజేపీలో ఆసక్తిపరిణామాలు చోటుచేసుకున్నాయి. జూన్ 30 న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. రాజాసింగ్ రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు రాజాసింగ్ రాజీనామాను ఆమోదించామని, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ప్రకటన విడుదల చేశారు. కాగా, ప్రస్తుతం రాజాసింగ్ అమర్నాథ్ యాత్రలో ఉన్నాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో అలిగిన రాజాసింగ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేఖ అందజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేసేందుకు తనను అనుమతించలేదని, అందుకే రాజీనామా చేసినట్టు రాజాసింగ్ తెలిపారు. అయితే రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు.

కాగా, ఇప్పుడు బీజేపీ అధిష్ఠానం రాజాసింగ్ రాజీనామాను ఆమోదించడంతో రాజాసింగ్ తర్వాత స్టెప్ ఏంటి? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు రాజాసింగ్ మహారాష్ట్రకు చెందిన శివసేనలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. అయితే అది బాల్ థాక్రే శివసేన లేక షిండే శివసేన నా అన్నది స్పష్టత లేదన్న ప్రచారం కొనసాగుతోంది. రాజీనామా చేసినప్పటి నుండే ఈ టాక్ వినిపిస్తున్నప్పటికీ రాజాసింగ్ దీనిపై స్పందించలేదు. అమర్నాథ్ యాత్ర నుండి తిరిగొచ్చిన తర్వాత తన తదుపరి దారి ఏంటో వెల్లడించే అవకాశం ఉంది.

ఇక, తెలంగాణ బీజేపీకి రాజాసింగ్ అనేక సేవలు ఆందించారని, రాజాసింగ్ రాజీనామా, దాని ఆమోదం బీజేపీకే ఎక్కువ నష్టం కలిగించే అవకాశం ఉందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More : టీటీడీలో అన్యమత ఉద్యోగులపై బండి సంజయ్ ఆగ్రహం