బీఆర్‌ఎస్ దాడులపై రామచందర్ రావు ఆగ్రహం

తెలంగాణలో మళ్లీ రాజకీయ వేడి రాజుకుంటోంది. మీడియా సంస్థలపై బీఆర్‌ఎస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారన్న ఆరోపణల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి సంస్థలపై బీఆర్ఎస్ గులాబీ కార్యకర్తలు దాడులు చేసినట్లు సమాచారం వచ్చిందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను ఆయన తీవ్రంగా ఖండిస్తూ, “ప్రజలు బీఆర్‌ఎస్‌ను స్పష్టంగా తిరస్కరించినా ఆ పార్టీ నేతలకు ఇప్పటికీ బుద్ధి రాలేదు. మీడియా సంస్థలపై దాడులు చేయడం అసహనానికి, చట్టానికీ విరుద్ధం. వాక్ స్వాతంత్ర్యాన్ని మేం గౌరవిస్తాం. తప్పు అయితే చట్టపరంగా పోరాటం చేస్తాం. కానీ దాడులకు దిగడం అంగీకరించం” అని స్పష్టం చేశారు. మీడియా సంస్థలకు తక్షణమే రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. బీజేవైఎం కార్యకర్తలకు కూడా అలాంటి దాడులను ఎదుర్కొనడానికి అవసరమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ నాయకులకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసిన రామచందర్ రావు, “ఇకపై మీడియా సంస్థలపై, ప్రజలపై దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. టీ న్యూస్‌ ఆఫీసుపైనా అదే రీతిలో స్పందిస్తాం” అని హెచ్చరించారు.

ఇక పాతబస్తీ సల్కం చెరువు భూములపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మించిన కాలేజీ విషయంలో కూడా రామచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. “అక్బరుద్దీన్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని చెప్పడం మామూలే. కానీ అదే ప్రదేశంలో నివసిస్తున్న వేలాది మంది పేదల బతుకులు లెక్కలేనా? మధ్య తరగతి ప్రజలు శ్రమించి కట్టుకున్న ఇండ్లను కాపాడడం ముఖ్యమైందే కదా?” అంటూ ప్రశ్నించారు.

అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన రామచందర్ రావు, “తక్షణమే అక్బరుద్దీన్ అక్రమ భవనాన్ని కూల్చివేయాలి. లేకపోతే ఆ పనిని మేం చేస్తాం” అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు.

Read More : తెలంగాణ పచ్చదనం కోసం సీఎం పిలుపు