పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చిన ప్రేమజంట దుర్మరణం

భారత్‌లో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనే ఆశతో పాకిస్థాన్‌ నుంచి అక్రమంగా భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ యువ ప్రేమజంట కథ విషాదాంతంగా ముగిసింది. థార్ ఎడారిలో దారితప్పిన ఈ జంట, మండుతున్న ఎండలు, కఠిన పరిస్థితులకు తట్టుకోలేక తూర్పు రాజస్థాన్‌లోని సరిహద్దులో దాహంతో ప్రాణాలు విడిచారు. శనివారం నాడు జైసల్మేర్ జిల్లాలోని సరిహద్దు గ్రామం సమీపంలో రెండు మృతదేహాలను ఓ పశువుల కాపరి గుర్తించగా, వెంటనే బీఎస్ఎఫ్‌కు సమాచారం అందించాడు. పోలీసులు పరిశీలించగా, మృతులు పాకిస్థాన్‌ సింధ్ ప్రావిన్స్‌కు చెందిన రవి కుమార్ (17), శాంతి బాయి (15)లుగా గుర్తించారు. వారి వద్ద ఓటరు కార్డులు, పాకిస్థాన్‌ సిమ్‌తో కూడిన ఫోన్‌లు లభించాయి.

మృతదేహాలు ఎండల ధాటికి నల్లబడి ఉండగా, యువకుడి నోటికి దగ్గరగా ఓ ఖాళీ వాటర్ క్యాన్ కనిపించడంతో, డీహైడ్రేషన్ కారణంగా మరణించారని అనుమానిస్తున్నారు. యువతి చేతికి పెళ్లికూతురు గాజులు ఉండటం మరింత దురదృష్టకరం. వీరిద్దరూ మతపరమైన వేధింపులు భరించలేక భారత్‌ వైపు తరలి వచ్చారని హిందూ పాకిస్థానీ నిర్వాసితుల సంఘం జిల్లా కోఆర్డినేటర్ దిలీప్ సింగ్ సోధా తెలిపారు.

వీసా కోసం దరఖాస్తు చేసినప్పటికీ, సరిహద్దు ఉద్రిక్తతల వల్ల ఆలస్యం కావడంతో, వారు నేరుగా అక్రమంగా ఎడారిప్రాంతం నుంచి ప్రవేశించేందుకు ప్రయత్నించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రేమజంట మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మరణానికి గల ఖచ్చిత కారణాలు కనుగొనడంలో పోలీసులు దృష్టి సారించారు.

ఈ ఘటన పాకిస్థాన్లో మైనారిటీ హిందువుల పరిస్థితిపై మరోసారి చర్చకు తెరలేపింది.

Read More : కాంటాలగా ఫేమ్ షెఫాలీ హఠాన్మరణంపై హృద్రోగ నిపుణుల విశ్లేషణ

One thought on “పాకిస్థాన్‌ నుంచి భారత్‌ వచ్చిన ప్రేమజంట దుర్మరణం

Comments are closed.