టీడీపీ సమావేశానికి గైర్హాజరైన ఎమ్మెల్యేలు…

తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి 15 మంది ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. దీనిపై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ముగింపు సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేస్తూ, ప్రజా ప్రతినిధుల గైర్హాజరు తనను తీవ్రంగా నిరాశపరిచిందని చెప్పారు. పార్టీ కార్యక్రమాలకంటే ఇతర వ్యక్తిగత పనులు ముఖ్యమా అంటూ సీఎం మండిపడ్డారు. ముఖ్యంగా 15 మంది ఎమ్మెల్యేలు విదేశాల్లో ఉండటాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. తానా, ఆటల టికెట్లు బుక్ చేసుకున్న వారి జాబితా తన వద్ద ఉన్నదని స్పష్టం చేశారు. ఇలా తరచూ విదేశీ పర్యటనలు చేసేవారు ఇకపై అక్కడే ఉండటం మంచిదని ఘాటుగా హెచ్చరించారు.

గైర్హాజరు అవ్వడానికి కొందరు దైవ దర్శనాలు, మరికొందరు విదేశీ పర్యటనలని కారణంగా చూపినట్టు తెలిపారు. ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల్లో ప్రజలతో మమేకం కావాలన్నారు. లేకపోతే ప్రజల విశ్వాసం కోల్పోతారన్న హెచ్చరిక చేశారు.

మొత్తం ఆహ్వానితుల్లో 56 మంది కూడా సమావేశానికి హాజరుకాలేదని తెలిపారు. ఉదయం వచ్చినవారిలో ఎంత మంది సంతకాలు పెట్టి మధ్యలో వెళ్లిపోయారో, ఎవరెవరు చివరి వరకు ఉన్నారో అన్నది తన వద్ద పూర్తి వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు.

ఉదయం 11 గంటలకు ప్రారంభమైన టీడీపీ విస్తృత స్థాయి సమావేశం సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగింది. చివరిలో చంద్రబాబు పార్టీ నేతలపై బాధ్యతారహిత వైఖరిని విమర్శిస్తూ, ఇకపై అందరూ పూర్తి సమర్పణతో పని చేయాలని స్పష్టం చేశారు.

Read More : మహా న్యూస్ ఘటనను ఖండించిన సీఎం