అమెరికా దాడులు – చైనా తీవ్ర ఖండన

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడులను చైనా తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ఐక్యరాజ్యసమితి చార్టర్ లో పేర్కొన్న సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

చైనా విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటనలో, ‘‘ఈ విధమైన ఏకపక్ష దాడులు ఆమోదయోగ్యం కావు. ఇవి ఇప్పటికే సున్నితంగా ఉన్న మధ్యప్రాచ్య పరిస్థితులను మరింత ఉద్రిక్తత వైపు నెడుస్తాయి,’’ అని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇజ్రాయెల్ వెంటనే కాల్పుల విరమణ పాటించాలని చైనా కోరింది. శాంతియుత చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం సాధ్యమని, ఇరు వర్గాలూ సంయమనం పాటించాలని సూచించింది. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల్లో అన్ని దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చైనా అధికార ప్రతినిధి పేర్కొన్నారు.

ఇరాన్ అణు స్థావరాలపై దాడుల నేపథ్యంలో చైనా నుంచి ఇది వచ్చిన తొలి అధికారిక స్పందన కావడం విశేషం. అమెరికా చర్యలపై ప్రపంచవ్యాప్తంగా నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న సమయంలో చైనా స్పందన ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More : ఇజ్రాయెల్ దాడిలో ఖుడ్స్ కమాండర్ ఇజాదీ మృతి