ఉద్యోగిపై యువతి రివాల్వర్‌తో బెదిరింపు

ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ పంపులో పనిచేస్తున్న ఉద్యోగి ఛాతీపై యువతి రివాల్వర్ గురిపెట్టిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బిల్ గ్రామ్ కొత్వాలి ప్రాంతంలోని సాండి రోడ్డుపై ఉన్న పెట్రోల్ పంపుకు షాబాద్‌కు చెందిన ఎహ్సాన్ ఖాన్ తన కుమార్తె సురీష్ ఖాన్ అలియాస్ అరిబా, భార్య హుస్న్ బానోతో కలిసి కారులో వచ్చారు.

ఈ సందర్భంగా సిఎన్‌జి నింపుతున్న ఉద్యోగి రజనీష్ కుమార్, కారులో ఉన్నవారిని కిందకు దిగమని కోరాడు. అయితే వారు దిగడానికి నిరాకరించడంతో రజనీష్ సిఎన్‌జి నింపేందుకు నిరాకరించాడు. ఈ విషయంపై వాదన తీవ్రంగా మారడంతో యువతి అరిబా కారులో ఉన్న రివాల్వర్ తీసి, రజనీష్ ఛాతీపై గురిపెట్టి బెదిరించింది.

సహచర ఉద్యోగులు వెంటనే స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. బాధిత ఉద్యోగి రజనీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం యువతి అరిబా, ఆమె తండ్రి ఎహ్సాన్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి లైసెన్స్ పొందిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.

Read More : హర్యానాలో యువ మోడల్ శీతల్ దారుణ హత్య

One thought on “ఉద్యోగిపై యువతి రివాల్వర్‌తో బెదిరింపు

Comments are closed.