మరణానంతర సంపాదనలో మైఖేల్ జాక్సన్ శిఖర స్థానం

మరణించిన తరువాత కూడా మైఖేల్ జాక్సన్ ఆదాయంలో రికార్డులు తిరగరాస్తున్నాడు. ప్రముఖ ఆర్థిక మ్యాగజైన్ ఫోర్బ్స్ తాజా నివేదిక ప్రకారం, 2009లో మరణించినప్పటికీ 2024లో ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన సెలబ్రిటీగా మైఖేల్ జాక్సన్ నిలిచాడు. ఈ ఏడాది ఆయన సంపాదన ఏకంగా 600 మిలియన్ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ తెలిపింది.

ఈ భారీ ఆదాయం ముఖ్యంగా అతని పాటల లైసెన్స్‌లు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌లపై వచ్చే రాయల్టీలు మరియు అతని జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన మ్యూజికల్ బయోపిక్ “MJ” హక్కుల అమ్మకాల ద్వారా వచ్చింది. జీవించి ఉన్న సెలబ్రిటీలతో పోలిస్తే కూడా జాక్సన్ ఆదాయం అత్యధికంగా ఉంది. ఉదాహరణకు, టేలర్ స్విఫ్ట్ 400 మిలియన్లు, టామ్ క్రూజ్ 25 మిలియన్లు, షారుఖ్ ఖాన్ 20 మిలియన్లు మాత్రమే సంపాదించారు.

మరణించిన ఇతర ప్రముఖులలో డాక్టర్ స్యూస్ 75 మిలియన్లు, ఎల్విస్ ప్రెస్లీ 50 మిలియన్లు, ఫ్రెడ్డీ మెర్క్యురీ 250 మిలియన్లతో ఉన్నప్పటికీ, మైఖేల్ జాక్సన్ అందరిలో అగ్రస్థానంలో నిలిచాడు. ఆయన మరణించిన తర్వాత ఇప్పటివరకు మొత్తం 3.2 బిలియన్ డాలర్లు సంపాదించాడని ఫోర్బ్స్ విశ్లేషణ చెబుతోంది.

చిన్నతనంలో జాక్సన్ ఫైవ్ సభ్యునిగా తన సంగీత ప్రయాణాన్ని ప్రారంభించిన మైఖేల్ జాక్సన్, సోలో సింగర్‌గా పాప్ మ్యూజిక్‌లో రాజుగా పేరు సంపాదించాడు. అతని ఆల్బమ్ “థ్రిల్లర్” ఇప్పటికీ అత్యధికంగా అమ్ముడైన రికార్డులలో ఒకటిగా నిలిచింది.

2009లో ప్రొపోఫోల్ మోతాదు ఎక్కువగా తీసుకోవడం వల్ల మైఖేల్ జాక్సన్ ప్రాణాలు కోల్పోయారు. అతని వైద్యుడు కాన్రాడ్ ముర్రే ఈ ఔషధాన్ని అందించాడు. అనంతరం 2011లో కాన్రాడ్ ముర్రే అసంకల్పిత హత్య ఆరోపణలపై దోషిగా తేలిపోయాడు.

Read More : ఇజ్రాయెల్ దాడులు: ఇరాన్‌లో 224 మంది మృతి