బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న కేసులో కొత్త మలుపులు

మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడిని హనీమూన్ సమయంలో దారుణంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపించే ఈ కేసులో రోజు రోజుకీ కొత్త కొత్త మలుపులు బయటపడుతున్నాయి. కిరాయి హంతకులు, వివాహేతర సంబంధం, రక్తపు మరకలతో కూడిన కత్తి, అనుమానాస్పద సంభాషణలు ఈ హత్యోదంతంలో కీలకంగా మారాయి. కేవలం వారం రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న భార్యే తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిందని పోలీసులు అనుమానిస్తున్నారు.

హనీమూన్‌ను సందర్బంగా చేసుకుని దారుణం

ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ ఇటీవల సోనమ్ అనే యువతిని వివాహం చేసుకున్నారు. నవదంపతులు మే 21న హనీమూన్ కోసం మేఘాలయలోని షిల్లాంగ్‌ చేరుకున్నారు. షిపారా హోమ్‌స్టేలో బస చేసిన ఈ జంట, మే 22న ద్విచక్ర వాహనాన్ని అద్దెకు తీసుకుని పర్యటనకు బయలుదేరారు. మే 23న ఉదయం 10 గంటల వరకు రాజా చివరిసారిగా ప్రాణాలతో కనిపించాడు.

అనుమానాస్పదంగా మారిన గైడ్ వాక్యం

రాజా, సోనమ్‌లకు గైడ్‌గా పనిచేసిన స్థానికుడు ఆల్బర్ట్ కీలక సమాచారం ఇచ్చాడు. మే 23న ఉదయం వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు, వారు హిందీలో మాట్లాడుతున్నట్లు పేర్కొన్నాడు. ఇది విచారణను కొత్త దిశలో తీసుకెళ్లింది. వారు స్థానికులు కాదన్న అంశం పోలీసులకు కీలక ఆధారంగా మారింది.

ప్లాన్ ప్రకారం హత్య? – నలుగురు అరెస్ట్

రాజా హత్యకు సంబంధించి విక్కీ, ఆకాశ్, ఆనంద్ అనే ముగ్గురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు కిరాయి హంతకులుగా వ్యవహరించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే రాజ్ కుష్వాహా అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. సోనమ్ తన భర్తను హత్య చేయించేందుకు ప్రియుడి సహకారంతో ముందుగానే ఈ హంతకుల్ని నియమించినట్లు పోలీసులు భావిస్తున్నారు.

దర్యాప్తులో కీలక ఆధారాలు

రక్తపు మరకలతో ఉన్న కత్తి, హోమ్‌స్టే సీసీ కెమెరా ఫుటేజీ, మొబైల్ టవర్ డేటా, హోటల్ రిజిస్టర్ల ఆధారంగా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సోనమ్ పాత్రపై స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటివరకు లభించిన ఆధారాలన్నీ ఆమె కుట్రలో భాగమని సూచిస్తున్నాయి.

Read More : ‘హనీమూన్ మర్డర్’ కేసులో మరో కీలక మలుపు

One thought on “బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న కేసులో కొత్త మలుపులు

Comments are closed.