Rahul Gandhi : జూన్ 26న హాజరు కావాలని ఆదేశం.

జార్ఖండ్‌లోని చైబాసా ఎంపీ–ఎమ్మెల్యే కోర్టు లోక్‌సభ ప్రతిపక్ష నేత, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 2018లో జరిగిన పరువు నష్టం కేసులో విచారణకు హాజరుకాకపోవడంతో ఈ చర్యకు పూనింది. ఈ కేసులో రాహుల్ గాంధీకి వచ్చే జూన్ 26న కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకావాలని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

పరువు నష్టం కేసు వివరాలు
2018లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. “హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు” అని ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల పరువు నష్టం కలిగించాయని ప్రతాప్ కతియార్ అనే బీజేపీ నేత చైబాసా సీజేఎం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ కేసు మొదట రాంచీ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయినా, తరువాత మళ్లీ చైబాసా కోర్టుకు బదిలీ అయింది. అప్పటి నుంచి ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.

కోర్టు నిర్లక్ష్యంపై కఠినంగా
కోర్టు నుంచి పలు సమన్లు వచ్చినా రాహుల్ గాంధీ వాటిని పట్టించుకోలేదు. దీంతో మొదట బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్టు, ఇప్పుడు మరింత కఠినంగా వ్యవహరిస్తూ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ తరఫున న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.

ఈ కేసు నేపథ్యంలో రాహుల్ గాంధీ జూన్ 26న కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుంది. తదుపరి విచారణ ఈ తేదీన జరగనుంది.

Read More : కార్ల కోసం కొత్త టోల్ పాస్ విధానం ప్రవేశం