మహిళ వేలు కోల్పోయిన ఘర్షణ

హైదరాబాద్‌లోని మధురానగర్ ప్రాంతంలో ఓ అద్దె ఇంటి వివాదం ఘర్షణకు దారి తీసింది. చీటీ డబ్బులు, అద్దె విషయాలపై తీవ్ర వాగ్వాదం జరిగి చివరకు ఓ మహిళ తన కుడిచేతి చూపుడు వేలు కోల్పోయిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే… జవహర్‌నగర్‌కు చెందిన సుజితకు మధురానగర్‌లో ఓ పెంట్‌హౌస్ ఉంది. గత మూడేళ్లుగా మమత అనే మహిళ అక్కడ అద్దెకు ఉండేది. ఇదే సమయంలో సుజిత, మమత వద్ద చీటీలు వేసింది. అందులో రూ.30 వేల వరకు చెల్లించాల్సిన విషయం ఉందట. ఇటీవల మమత ఆ ఇంటిని ఖాళీ చేసి, తన స్నేహితురాలు సుప్రియకు అద్దెకు ఇచ్చింది. అయితే వారం తిరగకముందే సుప్రియ ఇల్లు ఖాళీ చేసి, అద్దె కూడా చెల్లించకుండా వెళ్లిపోయింది.

ఈ పరిస్థితుల్లో చీటీ డబ్బుల గురించి మాట్లాడేందుకు మమత భర్త హేమంత్‌తో కలిసి సుజిత ఇంటికి వచ్చింది. అప్పటికే సుప్రియ ఇచ్చిన అద్దె చెల్లించలేదంటూ సుజిత కూడా మమతను నిలదీసింది. దీంతో ఇరువురి మధ్య మాటమాట పెరిగి ఘర్షణకు దారి తీసింది.గొడవ జరగడంతో, సుజిత తల్లి లత (45) జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించింది.

అయితే ఆ సమయంలో హేమంత్ తీవ్ర ఆగ్రహానికి గురై, లత కుడిచేతి చూపుడు వేలును బలంగా కొరికాడు. దాంతో వేలు పూర్తిగా తెగి కిందపడింది. తీవ్ర రక్తస్రావంతో బాధితురాలు ఆసుపత్రిలో చేరగా, వైద్యులు ఆ వేలు తిరిగి అతికించడం సాధ్యపడదని తెలిపారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న మధురానగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని విచారణ ప్రారంభించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు హేమంత్‌ను అరెస్ట్ చేశారు. చిన్నపాటి ఆర్థిక వివాదం ఇంతటి దారుణానికి దారితీయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. ప్రస్తుతం పోలీసులు మరింత విచారణ జరుపుతున్నారు.

Read More : హైదరాబాద్ అగ్నిప్రమాదంపై కేటీఆర్ స్పందన.

One thought on “మహిళ వేలు కోల్పోయిన ఘర్షణ

Comments are closed.