టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు ముంబై క్రికెట్ అసోసియేషన్ అరుదైన గౌరవం అందించింది. శుక్రవారం వాంఖడే స్టేడియంలోని ఒక స్టాండ్‌కు రోహిత్ శర్మ పేరు పెట్టారు. ఈ వేడుకకు రోహిత్ శర్మ తన తల్లిదండ్రులు, భార్య రితికతో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఈ స్టేడియంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
వాంఖడే ఒక గొప్ప స్టేడియమని, ఇక్కడ తనకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని రోహిత్ అన్నారు. భవిష్యత్తులో వన్డే ఫార్మాట్‌లో భారత జట్టు తరపున వాంఖడేలో ఆడాలని ఆకాంక్షించారు. స్టేడియంలో ఒక స్టాండ్‌కు తన పేరు పెడతారని కలలో కూడా ఊహించలేదన్నారు. ప్రతి ఆటగాడు బాగా ఆడాలని, దేశానికి సేవ చేయాలని కోరుకుంటారని, ఈ ప్రయాణంలో అనేక విజయాలు సాధిస్తారని చెప్పారు. అయితే, ఇవన్నింటి కంటే ఇది చాలా ప్రత్యేకమైనదని ఆయన అభిప్రాయపడ్డారు.
గొప్ప ఆటగాళ్లు, రాజకీయ నాయకుల మధ్య తన పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందని, ముంబై క్రికెట్ సంఘానికి కృతజ్ఞతలు తెలుపుతూ రోహిత్ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదిలా ఉండగా, వాంఖడే స్టేడియంలో ఇదివరకే సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, దిలీప్ వెంగ్‌సర్కార్‌ల పేర్లతో స్టాండ్‌లు ఉన్నాయి. తాజాగా రోహిత్ శర్మ, శరద్ పవార్, అజిత్ వాడేకర్ పేర్లతో కొత్త స్టాండ్లను ప్రారంభించారు.
