ప్రపంచ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 ఉత్సవాలు ఈ నెల 13న ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు వారాలపాటు ఈ వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. ఇప్పటికే ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఫెస్టివల్‌కు హాజరయ్యారు. అలాగే ఈసారి తొలిసారిగా ఆలియా భట్ హాజరవుతారని అభిమానులు ఎదురుచూస్తుండగా, ఆమె మాత్రం ఈ పర్యటనను రద్దు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
వెనక ఉన్న కారణం ఏమిటంటే?
అంతర్జాతీయ వార్తల ప్రకారం, భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఆలియా ఈ పర్యటనను రద్దు చేసినట్టు సమాచారం. ఫెస్టివల్ ప్రారంభోత్సవం మే 13న జరిగింది. ఈ వేడుకకు హాజరవ్వాలని ఆలియా ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ, అప్పటి పరిస్థితుల దృష్ట్యా ఆమె వెనక్కు తగ్గారు. కానీ తాజా పరిణామాల్లో, ఇరు దేశాల నేతలు కాల్పుల విరమణకు అంగీకరించిన నేపథ్యంలో, ఆలియా మళ్లీ కేన్స్‌కు చేరుకునే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం.
చిత్రలీలల్లో ఆలియా
ప్రస్తుతం ఆలియా భట్ నటించిన స్పై థ్రిల్లర్ “ఆల్ఫా” విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో శార్వరి కూడా ప్రధాన పాత్రలో నటిస్తోంది. అంతేకాకుండా, సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న “లవ్ & వార్” అనే భారీ మల్టీస్టారర్ మూవీలో కూడా ఆలియా నటిస్తోంది. ఇందులో రణబీర్ కపూర్, విక్కీ కౌశల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
కేన్స్ వేడుకల్లో జాన్వీ కపూర్, ఊర్వశి రౌతేలా వంటి బాలీవుడ్ తారలు కూడా సందడి చేయనుండటంతో ఈ ఏడాది ఫెస్టివల్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఈ వేడుకలు మే 24 వరకు కొనసాగనున్నాయి.
Read More : ‘థగ్ లైఫ్’ మూవీకి భారీ డీల్
