హైదరాబాద్ నగరం సాఫ్ట్‌వేర్, లైఫ్ సైన్సెస్ రంగాలలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC ) హబ్‌గా అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. నానక్‌రామ్‌గూడలోని సొనాటా సాఫ్ట్‌వేర్ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని అన్నారు. హైదరాబాద్ నగరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)-రెడీ డేటా సెంటర్లు, తయారీ రంగాలలోనూ ముఖ్యమైన కేంద్రంగా మారిందని చెప్పారు.
రాష్ట్రంలో ప్రగతిశీల విధానాల ఫలితంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, దాంతో లక్షకు పైగా ఉద్యోగావకాశాలు సృష్టించబడ్డాయని వివరించారు.
అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన, ప్రజా సంక్షేమం వంటి నాలుగు ముఖ్యమైన అంశాలను సమతుల్యంగా తీసుకెళ్లాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తుందని, అందులో పారిశ్రామికవేత్తలు, నిపుణులు, ప్రజలు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే కాక, యువతకు మంచి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు.
Read More : కవిత గణనీయమైన ఆరోపణలు.
